Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనిచేయని మూత్రశాలలు, మరుగుదొడ్లు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగేండ్లుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటంతో మహిళలు ఆస్పత్రికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మూత్రశాలలకు మరుగుదొడ్లకు సంబంధించిన పైపులైన్ రిపేరు ఉండడంతో వాటికిి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని, నాలుగేండ్లుగా నిరుపయోగంగా ఉంచారు. ఈ విషయంపై సంబంధిత డాక్టర్లను సంప్రదిస్తే మా దగ్గర బడ్జెట్ లేదని వాపోతున్నారు.
ఇబ్బందులు పడుతున్న గర్భిణీ స్త్రీలు...
ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు పరీక్షల సమయంలో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. తక్షణమే మూత్రశాలలు , మరుగుదొడ్లు బా గు చేయించాలని కోరుతున్నారు.
డాక్టర్లు సైతం ఆరు బయటకు వెళ్లాల్సిందే
బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పురుషులు , మహిళలు, డాక్టర్లు , సిబ్బంది ఎవరు అయినా (మూత్రశాలలు, మరుగుదొడ్ల) నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయంపై దష్టి సారించాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఇన్చార్జి డాక్టర్టేదిక్కు...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో వైద్య సేవలు ప్రజలకు అందడం లేదు. ఇప్పటికైనా పూర్తిస్థాయి డాక్టర్ ను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అపరిశుభ్రంగా ఆస్పత్రి పరిసరాలు
ఆస్పత్రి పరిసరాల ప్రాంతంలో చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆస్పత్రి వెనుక భాగంలో పిచ్చి మొక్కలు మొలవడం , నిర్వహణ సరిగ్గా లేదు. స్టోర్ రూమ్‌లా ఆస్పత్రి గదులు తలపిస్తున్నాయి.
రెగ్యులర్ డాక్టర్‌ను కేటాయించాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ
పీహెచ్సీలో రెగ్యులర్ డాక్టర్ ను కేటాయించి, ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలి. శానిటేషన్ నిర్వాహణ సరిగ్గా లేదు.
మౌలిక వసతులు కల్పిస్తాం
డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రశాంత్
బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటేషన్గా తుర్కపల్లి డాక్టర్ ఇంద్రాణి పని చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలోనే ఎంపీడీవో సహకారంతో అండర్ డ్రయినేజీ వ్యవస్థను బాగు చేయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తాం.