Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుచర వర్గమే కూసుకుంట్లపై నిరసనగళం
- ఒకవైపు ఈనెల 20న కేసీఆర్ సభకు మునుగోడులో ఏర్పాట్లు చేస్తున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఆయన వ్యవహార శైలిపై బహిరంగ విమర్శలు
- కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీ మారడానికి సిద్ధపడుతున్న అసమ్మతి వర్గం
- దండుమల్కాపురంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల భేటీ
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికలు అధికార పార్టీ టటీిఆర్ఎస్లో లుకలుకలు తెచ్చి పెట్టింది. తాను ఒకటి తలిచితే దైవం ఒకటి తలచేనా అన్నచందంగా టిఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఉంది. 2018లో మునుగోడులో టీఆర్ఎస్ ఓడిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గంలో జడ్పిటిసి నుండి వార్డు మెంబర్ వరకు కూసుకుంట్ల అనుచరులకే పదవులు కట్టబెట్టారు. అయినా మునుగోడు లో జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే పనిచేయమని ఇప్పటికే నియోజకవర్గంలోనే జడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు అధిష్టానానికి లేఖలు పంపారు. దీంతో అధిష్టానం అసమతి నేతలను బుజ్జగించే పనిని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రావుకు అప్పగించారు. రెండు రోజుల క్రితం మంత్రి ఇంట్లో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను రప్పించుకొని మాట్లాడారు. మునుగోడు ఎంపీపీ, చౌటుప్పల్ మార్కెట్ వైస్ చైర్మెన్లు తప్ప వెళ్ళిన వారందరూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిని వారి ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. అసమతినేతలను బుజ్జగించడం తలనొప్పిగా మారడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడిస్తానని చెప్పి ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. కెసిఆర్ అపాయింట్మెంట్ లేకపోవడంతో అక్కడే ప్రెస్ మీట్ పెట్టి అధిష్టాన నిర్ణయించే వ్యక్తికి పని చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.
కూసుకుంట్లకే టికెట్ అని అధిష్టానం సంకేతాలు
%మునుగోడు టికెట్టు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఖరారైనట్లు అధిష్టానం నుంచి సంకేతాలు లీకవడంతో అసమతినేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులకే పదవులను కట్టబెట్టిన కూడా వారు ఇప్పుడు ఆయన వ్యవహార శైలి పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుచర వర్గమే అసమ్మతిగా మారడంతో వారికి నచ్చజెప్పడం టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సవాలుగా మారింది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను నాయకులను పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఏ ప్రజాప్రతినిధితో సఖ్యత లేకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని అసమ్మతినేతలు ఆరోపిస్తున్నారు.ఒకవైపు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ తో సభ నిర్వహించడానికి మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం సభా స్థలాన్ని పరిశీలించారు.
- దండు మల్కాపురంలో అసమతినేతల సమావేశం
- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే అధిష్టానం ఉన్నట్లు సంకేతాలు లీకవ్వడంతో నియోజకవర్గంలోనే అసమతినేతలు శుక్రవారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని జెడ్పిటిసిలు, ఎంపీపీలు, చైర్మన్లు, సర్పంచులు ఎంపీటీసీలు 200 మంది పైగా హాజరయ్యారు. టిఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఉన్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా టికెట్ కేటాయిస్తే మునుగోడులో కూసుకుంట్లను ఓడిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు అందరినీ కల్పించి మాట్లాడిస్తానని చెప్పిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూసుకుంట్లకే టికెట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుండి నియోజకవర్గంలో టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా ఉంది. రెండు గ్రూపులు ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ఐదు గ్రూపులుగా విడిపోయింది. కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఉన్న అసమతి నేతలను తమ దారిలోకి తెచ్చుకోవడానికి టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది తప్పడం లేదు. ఆయన అనుచరులుగా ఉండి, అసమ్మతినేతలుగా మారిన వారిని బుజ్జగించడం సవాల్ గా మారింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి ఇప్పటివరకు కర్నే అనుచర వర్గాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. కనీసం వారికి పార్టీ పదవుల్లో కూడా ప్రాతినిధ్యం లేకుండా వ్యవహరించారు. ఒకవేళ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మునుగోడు టికెట్ అధిష్టానం కేటాయిస్తే కర్నే అనుచర వర్గం సహకరించేలా కనిపించడం లేదు. మునుగోడు టిఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కాకుండా మరే వ్యక్తికి కేటాయించిన సహకరించి గెలిపిస్తామని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
- పార్టీ మారడానికి సైతం సిద్ధమవుతున్న అసమతి నేతలు
ఆర్థికంగా నష్టపోయేలా తమను ఇబ్బంది పెట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి టికెట్ కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించలేదని కొంతమంది అసమ్మతినేతలు చెప్తున్నారు. అధిష్టానం నిర్ణయం పేరుతో మంత్రి జగదీశ్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇప్పించేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మా గోడును పరిగణలోకి తీసుకోకుండా అధిష్టానం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే టిఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారడానికి వెనకాడమని అసమ్మతినేతలు అంటున్నారు. అసమతి నేతలను బుజ్జగించడానికి మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటికి పిలిపించుకున్న కూడా వారు తగ్గడం లేదు. నియోజకవర్గంలోని ఓ మండల జడ్పిటిసి మండలంలోని 12 మంది సర్పంచులను తీసుకొని పార్టీ మారడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరో మండలంలో ఎంపీపీ గా ఉన్న కూసుకుంట్ల అనుచరుడే పార్టీ మారడానికి వెనుకాడనని సన్నిహితుల వద్ద చెప్తున్నారు. నియోజకవర్గంలో కీలక మండలం గా ఉన్న ఓ మండల ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లతోపాటు గ్రామాల సర్పంచులు కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి కోసం పనిచేస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులే కాకుండా, పలువురు వ్యాపారస్తులు సైతం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఓటమి కోసం పనిచేసే అవకాశాలు లేకపోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచర వర్గంలోనే ఇంతటి అసమ్మతిని మూటగట్టుకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా.? లేదా మరో నేతకు కేటాయిస్తుందా..? తేలాల్సి ఉంది.