Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక పరీక్ష కట్ ఆఫ్ మార్కుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ కు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.నోటిఫికేషన్లో గతంలో అభ్యర్థులకు 80 మార్కులు కటాఫ్ ఉండగా ఈ నోటిఫికేషన్లో అధికారులు 20 మార్కులు తగ్గించి 60 మార్కులు కటాఫ్ పెట్టారన్నారు.బీసీలకు 70 మార్కులు కటాఫ్ ఉండగా 10 మార్కులు తగ్గించి 60 మార్కులు కటాఫ్ చేశారన్నారు.ఎస్సీలకు మాత్రం ఎటువంటి మినహాయింపు లేకుండా గతంలో మాదిరిగా 40 కటాప్ మార్కులు ఉంచారని ,ఇది ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయమన్నారు.ఎస్సీ, ఎస్టీ బీసీ లకు కూడా ఓసీల మాదిరిగా గతంలోని కటాఫ్‌కు 20 మార్కులు తగ్గించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా గతంలో నోటిఫికేషన్‌కు భిన్నంగా డిగ్రీ పాస్ అయి ఉండాలనే నిబంధన విధించడం తమవర్గాలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు.నోటిఫికేషన్‌లోని లోపాలను సవరించి రీనోటిఫికేషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు.ఎస్సీ, ఎస్టీ,బీసీవర్గాలకు జరిగిన అన్యాయంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ,మంత్రులకు అన్యాయం జరిగిన ఎస్ఐ అభ్యర్థులతో కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నామన్నారు.స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో మహాజనసోషలిస్టు పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరిరాజుమాదిగ,నియోజకవర్గ నాయకులు వడ్డేపల్లి కోటేష్, ఎలమర్తి రాము, కొండపల్లిఆంజనేయులు, కొత్తపల్లి అంజయ్య, రావి స్నేహలతచౌదరి, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కుడుముల శ్రీను, పట్టణఉపాధ్యక్షులు సోమపంగునరేష్, ఏపూరిసత్యరాజు,యలమర్తి ఉపేందర్, ఎస్కె.మౌలానా,సోమపంగు సురేష్, మిట్టగనుపుల పందిటి నవీన్‌కుమార్, ముత్యాలు, మాతంగి మట్టయ్య ఉన్నారు.