Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ప్రజల మనిషిగా రంగన్న పేరు తెచ్చుకున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.జీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాసిన ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక విఘ్నేశ్వర ఎస్టేట్‌లో ఆదివారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభలో రంగన్న అనేక ప్రజా సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారం కోసం పనిచేశారన్నారు.15 ఏండ్ల్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాజకీయ వ్యాసాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. వాటిని పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.రంగన్న తన ప్రజాప్రస్థానంలో అనుభవాలకు, ఉద్యమాలకు కలంపట్టి పుస్తక రూపం దాల్చారన్నారు.దీనిలో 24 వ్యాసాలు ఉండగా 22 వ్యాసాలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఉందన్నారు.రెండు వ్యాసాలు మాత్రం కేంద్రం వ్యవహరించే తీరుపై విశ్లేషిస్తూ రాశారన్నారు.రాజ్యాంగాన్ని ,ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారోవివరించారన్నారు.14 వ్యాసాలను మాత్రం 2009లో అసెంబ్లీలో తను ఎదుర్కొన్న అనుభవాలను, ప్రతిపక్షంలో వ్యవహరించిన తీరును వివరిస్తూ రాశారన్నారు.అసెంబ్లీలో వ్యవహరించే విధానం ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య రాష్ట్రాల మధ్య మత విధ్వేషాలు, విభేదాలు సృష్టిస్తూ వినాశకరంగా వ్యవహరిస్తుందన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినా బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఉపాధి లేక తెలంగాణలోకి వలసబాట పట్టారన్నారు.పవిత్ర స్థలాలైన రెండు రాష్ట్రాలలో ఈ దుస్థితికి కారణం బీజేపీ పాలకులేనన్నారు.తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా ఎమ్మెల్సీ కాగలిగానని అన్నారు. నేటి యువతరం పెడదోవ పడుతుందన్నారు.ఈ పుస్తకం వారికి దిక్సూచిగా ఉంటుందన్నారు.నోటు లేని ఓటుతోనే గెలిచినప్పుడు నిజమైన ఎన్నిక జరిగి నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.తెలంగాణ అభివృద్ధికి ఈ పుస్తకం మార్గదర్శిగా ఉంటుందన్నారు.
ప్రజల గొంతుక పుస్తకం అందరు చదవాలి
పుస్తకావిష్కరణలో చెరుపల్లి సీతారాములు
ప్రజా సమస్యల లేవనెత్తి వాటి పరిష్కారం చూపిన ప్రజల గొంతుక పుస్తకం అందరు చదవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రజల గొంతుక పుస్తకావిష్కరణలో సభా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుష్పం రచించేందుకు ఎంతో శ్రమ పడ్డారని ఎంతో సమయం వెచ్చించారని తెలిపారు. అందరూ చదివితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
నన్ను ఈ స్థాయికి చేర్చింది ఎర్రజెండానే
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నన్ను ఈ స్థాయికి చేర్చింది ఎర్రజెండానే అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తాను రాసిన ప్రజల గొంతుక పుస్తకవిష్కరణలో మాట్లాడారు.ఊహ తెలిసినప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం నమ్ముకుని ఉన్నానని, జెండా, ఏజెండా, సిద్ధాంతాలు ఎప్పటికీ మరువననన్నారు.వీటిని మించినవి మరొకటి లేవని చెప్పారు.ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరణను ఎప్పటికీ మరువనన్నారు.పార్టీ, కార్యకర్తలు, ఉద్యమాలు తనకు ఎంతోనేర్పాయన్నారు.పదవిలో ఉన్నా లేకపోయినా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. తరుణ ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అలుపెరుగని యోధుడు రంగన్న
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
అలుపెరుగని యోధుడుగా రంగన్న నిలిచారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు.నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉంటారని,మొహంలో ఎప్పుడూ అలసట కనిపించవని చెప్పారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా రంగన్న నిలిచిపోయారని చెప్పారు.ప్రజల గొంతుక పుస్తకంలో వ్యాసాలు కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయన్నారు.ముఖ్యంగా అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను క్లుప్తంగా వివరించారని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.అన్ని వర్గాల ప్రజలు అన్ని తరగతుల వారికి ఉపయోగపడే విధంగా పుస్తకం ఉందన్నారు.యువత ఈ పుస్తకాన్ని చదివి ఆదర్శంగా నిలవాలని కోరారు..
అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో రంగన్నను నేనే గెలిపిస్తా....
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మతతత్వ పార్టీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీలు కలిసి పనిచేయడం శుభపరిణామమం. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా రంగన్నకు టికెట్ కేటాయిస్తే తానే ముందుండి గెలిపిస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు.బీజేపీని ఓడించేందుకు సీపీఐ(ఎం) టీఆర్ఎస్తో కలిసి పని చేస్తుందన్నారు.అందులో భాగంగా సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.40 ఏండ్ల కిందటే రంగన్నతో పరిచయం ఉందన్నారు.నాడు తక్కువ ధరకు యూరియా అమ్మాలని పోరాటం చేసినప్పుడు రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చారని,అది తనకు ఇప్పటికీ గుర్తుందని అన్నారు.తాను 10 ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజక వర్గంలో ఇప్పటికీ రంగన్ననే ఎమ్మెల్యేగా ప్రజలు భావిస్తు న్నారని చెప్పారు.నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకుండా నిరంతరం ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారన్నారు మతతత్వ పార్టీలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్తో కలిసి రావడం శుభ పరిణామమన్నారు.శాసనసభలో లేవనెత్తిన అంశాలను పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మెన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ జెడ్పీ మాజీ చైర్మెన్ సీడీ రవికుమార్, మానవ హక్కుల వేదిక నాయకులు సుబ్బారావు, సీపీఐ(ఎం) నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు బంటు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశం, సీపీఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు,మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, ప్రముఖవైద్యులు మువ్వా రామారావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు జె.రాజు, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, మైనార్టీ నాయకులు మహమ్మద్భాషా, సీనియర్ జర్నలిస్టు కే.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.