Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరిస్తే చరిత్రహీనులవుతారు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని, చరిత్రను వక్రీకరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఔరవాని గ్రామంలో ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సాయుధ పోరాట యోధులు నీరుడు నర్సిరెడ్డి(88), నాంపల్లి పిచ్చమ్మ(90)లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన దేశ చరిత్రలో భారత స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం ఒక ఉజ్వల ఘట్టం. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం అశేష ప్రజానీకం, కుల, మత, భాష ప్రాంతీయ విభేదాలను అధిగమించి ఐక్యంగా పాల్గొన్నారన్నారు. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కమ్యూనిస్టులు జాతీయ ఉద్యమంలో తమ పాత్ర గురించి అధికారికంగా డాక్యుమెంటేషన్ చేశారన్నారు. .దేశభక్తి అనే ప్రచారం చేసుకునే ఆర్ఎస్ఎస్ గాని, వేరే హిందుత్వ సంస్థలుగాని అటువంటి డాక్యుమెంటేషన్ చేయగలవా ? అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు 75 వ స్వతంత్ర ఉత్సవాలను జరుపుతున్నాయి. అవి జరిగే సమయంలో ఆనాడు విద్రోహపూరిత పాత్ర పోషించిన హిందుత్వ శక్తులే కేంద్రంలో అధికారంలో ఉండటం దేశం ముందున్న అత్యంత విషాద ఘట్టం అని చెప్పారు. సెప్టెంబర్ 17 విమోచన దినం కాదని విలీన దినమని వివరించారు . ఆనాడు నైజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే పరిస్థితిని కమ్యూనిస్టులు తీసుకొచ్చారని, నెహ్రూ సైన్యం ముందు నైజం రాజు విలీనం చేశారు.. తప్ప విమోచనం చేసిన దాఖలాలు లేవని తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ విమోచన దినంగా ప్రకటించాలని అనడం హాస్యస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఆర్ వెంకటేశ్వర్లు, పుచ్చకాయల నర్సిరెడ్డి, మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, గీత కార్మిక సంఘం నాయకులు అచ్చాలు, సీతారాములు, మండల కమిటీ సభ్యులు దండు.రవి, కల్లూరి కంఠం, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.