Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణ ప్రాంతాలలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు పని కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ ప్రధమ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరై నారి ఐలయ్య మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ఏర్పడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ పేదలకు వర్తించే విధంగా పథకం అమలు చేస్తూ రోజు కూలి 600 రూపాయలు నిర్ణయించి, రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనిలో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు తగ్గిస్తూ అనేక రకాలైన జీవోలను తెస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి గ్రామీణ పేదలు రాకుండా చేస్తున్నదని, పెరుగుతున్న ధరల కనుగుణంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజువారి వేతనం పెంచకుండా, చేసిన కూలీలకు వారం వారం డబ్బులు చెల్లించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొందని, దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణ కోసం తీసుకోబోయే ఉద్యమాన్ని గురించి, పట్టణ ప్రాంతాలకు విస్తరణ గురించి, రోజు కూలీ రూ.600, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు జరిగే విధంగా నిర్వహించే ప్రజా పోరాటాలలో పట్టణ పేదలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రుద్రాక్ష యాదయ్య, ఉపాధ్యక్షులుగా తెలకపల్లి శ్రీను, వడ్డే ధనమ్మ, ప్రధాన కార్యదర్శిగా దండంపల్లి సరోజ, సహాయ కార్యదర్శిగా గనిపల్లి రాములు, పగిడిపాల యాదమ్మ, కోశాధికారిగా భీమోజు పద్మ, కమిటీ సభ్యులుగా పనస చంద్రయ్య, కత్తుల ముత్తమ్మ, మొగిలిపాలెం ఇందిరమ్మ, మరో నలుగురు కో ఆప్షన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని సవార్ధ సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, అన్న భీమోజు పద్మ, ఆకిటి లింగమ్మ, అద్దంకి నరసింహ, గనిపల్లి రాములు, విజరు కుమార్, బుజ్జమ్మ, వడ్డే ధనమ్మ, పనస చంద్రయ్య, కత్తుల ముత్తయ్య, ఇందిరా, అరుణ షబానా తదితరులు పాల్గొన్నారు.