Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండరూరల్
భారత రైతాంగ ఉద్యమచరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు.ఆదివారం సీపీఐ(ఎం) నల్లగొండ మండల కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు రసూల్‌పుర గ్రామ నివాసి చింతపల్లి రామచంద్రయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా భూమికోసం, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటమన్నారు.ఈ పోరాట ప్రాముఖ్యత నేటి తరం తెలుసుకోకుండా పాలక పార్టీలన్నీ విమోచన నాటకాన్ని తెరమీదకు తెస్తున్నాయని, నిజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ హక్కులు లేకుండా, వెట్టిచాకిరి చేస్తూ, దారుణదోపిడీకి గురవుతున్న సమయంలో ఆంధ్రామహాసభ జరిగిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టిందని, వెట్టిచాకిరి రద్దు, కౌలు తగ్గింపు, దున్నే వానికే భూమిపై హక్కుల డిమాండ్‌ను ముందుకు తెచ్చిందని ప్రజల పెద్దఎత్తున సంఘటిత పడ్డారన్నారు.'నీ బాంచన్ దొర'అన్న పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ కలిగించిన చైతన్యంతో జమీందార్ల, దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించసాగారని, వెట్టిచాకిరిని వ్యతిరేకించారని భూమి కోసం పోరు ప్రారంభమైందన్నారు.జమీందార్ల, దేశ్ ముఖ్ల గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయని సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని వేలాది గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. ప్రజలతిరుగుబాటుకు భయపడి జమీందార్లు, దేశ్ ముఖ్లు, జాగీర్ధార్లు, పట్టణాలకు పారిపోయారన్నారు.నిజాం నిరంకుశ ప్రభుత్వం రైతాంగ పోరాట ప్రాంతంలో మిలటరీ క్యాంపు పెట్టి గ్రామాలపై దాడులు సాగించిందని, చిత్రహింసలకు గురిచేసిందని, ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారని స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారని పచ్చి బాలింతలను కూడా వదిలిపెట్టలేదని, తల్లుల ఎదుటే పిల్లలను చంపటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సాయుధ పోరాటాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా ఆనాటి పోరాట అనుభవాలను నేడు యువతరానికి అందించాలని, ఆ స్పూర్తితో ముందుకు పోవాలన్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నలుపరాజు సైదులు అద్యక్షత వహించిన ఈ సభలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు దొండ క్రిష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్, మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.