Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాంచన్ కాలు మొక్కుత దొర అనే బానిసత్వానికి చరమగీతం పాడిన వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని బిజెపి వక్రీకరిస్తుందని, దాని పోరాట స్ఫూర్తితో మతోన్మాదాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించు కొని యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో సాయుధ పోరాట యోధుడు దుంపల మల్లారెడ్డి కుటుంబానికి దుంపల మల్లారెడ్డి దళ సభ్యుడు కంఠం సాయిలు కు దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ చైర్మెన్ గూడూరు అంజిరెడ్డికి సన్మానం చేశారు. అనంతరం జహంగీర్ మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్త్తోందన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ సమాజానికి ప్రజలకు తప్పుడు సందేశాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు. భూమి భక్తి విముక్తి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాలుగు వేల మంది అమరవీరుల ప్రాణత్యాగం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదని అదేవిధంగా సాయుధ పోరాటంలో చిన్న పాత్ర కూడా లేని బీజేపీ సాయుధ పోరాటం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదన్నారు. సమాజంలో మతోన్మాదం మరింత ప్రమాదంగా మారుతుంది అని వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మతోన్మాదాన్ని తిప్పి కొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, నాయకులు మంచాల మధు, పెంటా రెడ్డి ,శంకర్, బబ్బురి శ్రీను, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.