Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అక్టోబర్ 16న జరిగే పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు సంబంధించి పరీక్షా క్రేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష కేంద్రాలలో వసతి సౌకర్యాలపై ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే అక్టోబరు 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు గాను జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 3645 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. 62 కేంద్రాలకు సంబంధించి 18 ప్రభుత్వ, 17 ప్రయివేటు కలిపి మొత్తం 35 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు లేనందున వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి అవసరమున్న చోట దాతల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షనే కాకుండా ఇతర పరీక్షల నిర్వహణకు కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, ఎసిపి వెంకటరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి ద్వారా ప్రజలు అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 20 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. రెవిన్యూ శాఖ 12, మున్సిపాలిటీలు 3, ఎంపీడీిఓలు సంబంధించి 2, దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, విద్యా శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.