Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14,15,16వ తేదీల్లో కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాల్గోమహాసభలు
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్లనాగరాజు పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా ఫ్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 14, 15, 16 వ తేదీలల్లో కరీంనగర్ జిల్లాకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేశాయని,విద్యారంగానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయవిద్యావిధానంతో పాఠ్యాంశాల్లో మూఢత్వం, అశాస్త్రీయభావాలను జొప్పిస్తుందన్నారు.అశాస్త్రీయ భావాలను తిప్పికొడుతూ శాస్త్రీయ విద్యావిధానానికి ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేలకోట్ల స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు.వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమవసతి గహాల్లో మెస్, కాస్మోటిక్చార్జీలను పెంచడంతో పాటు పక్కా భవనాలు నిర్మించాలన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా గురుకులాల్లో టెండర్లు ఇవ్వలేదని యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు.పెంచిన బస్పాస్చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు.అనంతరం నూతన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీని 13 మందితో ఎన్నుకున్నారు.నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బాణోత్ వినోద్నాయక్, ధనియాకుల శ్రీకాంత్వర్మలను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్వర్మ, బానోత్వినోద్నాయక్, వేల్పుల ఉత్తేజ్, జంగంపల్లిసాయి, ఇంద్రాణి,జాని, అభి, నర్సింహ, సుమన్, కోటేష్,సాయి, అనిత పాల్గొన్నారు.