Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతాబ్దపు ఆనవాళ్లు కనుమరుగు..
- క్లా(లా)క్ టవర్ చేసిన పాలకులు
- వెల్లువెత్తుతున్న విమర్శలు..
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఆకాశానికి అద్దం లాంటి నిర్మాణం.. 25 అడుగుల ఎత్తులో కొలువుతీరిన కట్టడం.. తనదైన రూపుతో చూపరులను ఆకట్టుకునే నిర్మాణం. సుమారు 150 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన చిహ్నం. ఓ సాధారణ ఇల్లు కట్టడం అంటేనే మాటలు కాదు.. అలాంటిది ఓ చారిత్రక కట్టడం నిర్మించాలంటే ఇక చెప్పనవసరమే లేదు. అదొక చరిత్ర కలిగిన చారిత్రక కట్టడం. శతాబ్దపు వయస్సున్న ఈ చరిత్రకు మరమ్మతులు చేయాల్సింది పోయి ఆ చరిత్రకే సమాధి కట్టారు నేటి పాలకులు. చరిత్రను నిర్మించాలంటే చాలా కష్టమైన పని కానీ అలాంటి చరిత్రలు మన దగ్గర నిక్షిప్తమై ఉంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అది ప్రభుత్వాల బాధ్యత కూడా.. గత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. నల్లగొండ నడిబొడ్డున ప్రధాన రహదారిపై టీవీగా, హుందాగా ఉన్న క్లాక్ టవర్ సెంటర్ అటువైపు వెళ్లే ఎవరు చూపులనైనా ఇట్టే ఆకర్షించేది. అలాంటి క్లాక్ టవర్ సెంటర్‌ను లాక్ టవర్ సెంటర్‌గా మార్చారు నేటి పాలకులు. నల్లగొండ జిల్లా చరిత్రలో ఇది ఒక భాగం. శతాబ్దపు పైబడి వయస్సున్న క్లాక్ టవర్‌కు చాలా విశిష్టత ఉంది. ఈ క్లాక్ టవర్‌ను నిజాం ప్రభువులు 1724 నుండి 1948 వరకు నిజాం రాజ్యంలో హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంగా పరిపాలించిన కాలంలో రజతోత్సవాల వేడుకల సందర్భంగా ముఖ్యమైన పట్టణాలను గుర్తించి పది గడియారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక గడియారమే నల్లగొండ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ సెంటర్. పెద్ద గడియారం ఇత్తడి భాగాలతో తయారు చేయబడి పంజరంలో నాలుగు గడియారాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. రాత్రిపూట ఉపయోగం కోసం అంతర్ నిర్మిత దీపంతో ఒక సమయాన్ని ఉంచేవారు. అప్పటినుండి ఈ క్లాక్ టవర్ సెంటర్ జిల్లా చరిత్రలో ఒక భాగమైంది.
25 అడుగుల నిలువెత్తు సాక్ష్యం...
నల్లగొండలోని ప్రధాన కూడలిలో నాటి నిజాం పాలకులు ఏర్పాటుచేసిన శతాబ్దాల నాటి క్లాక్ టవర్‌ను తొలగించడం పట్ల జిల్లా ప్రజలు పాలకుల తీరును విమర్శిస్తున్నారు. పట్టణ సుందరీకరణ పేరుతో క్లాక్ టవర్‌ను తొలగించడం నల్లగొండ పట్టణ వాసులకు ఏమాత్రం ఇష్టం లేదంటే అతిశయోక్తి కాదు. నల్లగొండ జిల్లా ప్రజలు క్లాక్ టవర్‌ను పెద్ద గడియారంగా పిలుచుకుంటారు. ఆ పెద్ద గడియారం కేవలం కాల పరికరం మాత్రమే కాదని వారసత్వంలో భాగమని వారి నమ్మకం. 25 అడుగుల ఎత్తు స్తంభంపై నాలుగు ముఖాల స్క్వారైడ్ గడియారం దశాబ్దాలుగా పట్టణానికి ల్యాండ్ మార్క్. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలు, ఉద్యమాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తెలంగాణ ఉద్యమాల అన్ని దశలతో సహా ప్రజల ఆందోళనకు ఇది 25 అడుగుల నిలువెత్తు సాక్ష్యం.
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ...
పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్లాక్ టవర్‌ను పూర్తిగా తొలగించడంతో దాని గుండా వెళ్తున్నప్పుడు ప్రజలు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం నల్లగొండ పట్టణంలో చేతి గడియారాలు ధరించడం అంటే మహా గొప్ప విషయమే. కార్యాలయాలు లేదా ఇతర పని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రజలు సమయం తెలుసుకోవడానికి పెద్ద గడియారం పైనే ఆధారపడేవారు.
మూలన పడ్డ చరిత్ర
శతాబ్దాల చరిత్ర కలిగిన క్లాక్ టవర్‌కు మరమ్మతులు చేయించకుండా తొలగించి, పనికిరాని పరికరంగా మున్సిపాలిటీ అధికారులు ప్రకాశం బజార్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఎమిరాల్డ్ గార్డెన్లో కళా విహినంగా ఏర్పాటు చేశారు. దీంతో అటువైపు వస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప చరిత్ర కలిగిన క్లాక్ టవర్‌ను ఇలా చేశారంటూ మండిపడుతున్నారు.
చరిత్రను పొగిడిన ముఖ్యమంత్రి..
నిజాం ప్రభుల పరిపాలన, కట్టడాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా పొగడ్తలతో ముంచెత్తారు. కొన్ని సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ చరిత్రను గుర్తు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ చరిత్ర అంటే నిజమే తెలంగాణ చరిత్ర అన్నారు. మరో సందర్భంలో మాట్లాడుతూ రాజ్యంలో చిన్నచిన్న తప్పులు జరుగుతాయని నిజాం రాజులు గొప్ప లౌకిక తత్వం కలిగిన రాజులని ప్రశంసించారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రియే నిజాం పాలనను మెచ్చుకున్నారంటే వారి పరిపాలన, చారిత్రక కట్టడాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చారిత్రక కట్టడాలపై దాడి చేయడమే
వేముల రంజిత్ కుమార్, న్యాయవాది నల్గొండ
నల్లగొండ అంటే గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. క్లాక్ టవర్‌కు ఘనమైన చరిత్ర ఉంది. నిజాం రాజులు వజ్రోత్సవాల సందర్భంలో దానిని ఏర్పాటు చేసినట్లు చరిత్రలో ఉంది. అలాంటి చరిత్ర కలిగిన క్లాక్ టవర్ ను తొలగించడం అంటే చారిత్రక కట్టడాలపై దాడి చేయడమే. పాత క్లాత్ టవర్ కు మరమ్మత్తులు చేసి పునర్ ప్రతిష్టించాలి.