Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత రంగు పులుముతున్న బీజేపీ
- సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని రామగిరిలో జరిగిన సభ అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దొరలు, నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమన్నారు. దానిని బీజేపీ మతం రంగు పులుముతూ సెప్టెంబర్ 17 విలీన దినం జరుపుతామని అనడం సిగ్గుచేటన్నారు. రజాకార్లు పటేల్ సైన్యాలు మీలాకతై కమ్యూనిస్టులను అనుచడానికి కుట్రలు చేశారన్నారు. పటేల్ సైన్యాలు రజాకారులను లొంగదీసుకుని విమోచన చేస్తే రాజాభరణాలు ఇస్తూ నిజామును గవర్నర్గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పోరాటంలో లేని, పోరాట చరిత్ర లేని బిజెపి చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, జాతీయ ప్రాజెక్టులను గుర్తించకుండా అన్యాయం చేస్తూ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రేమను వలకబోస్తున్నారని విమర్శించారు. నాటి పోరాటంలో ముగ్దుమ్ముద్దిన్ బందగి లాంటి ఎంతో మంది ముస్లింలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సన్మాన గ్రహీత పెన్నా అనంతరామ శర్మ మాట్లాడుతూ నాటి పోరాటంలో వేలాదిమంది అమరులయ్యారని వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవశ్యకతను వివరించారు. ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చాలని, నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు మారగోని నగేష్, గంజి నాగరాజు, మాటూరి నరేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.