Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లాలోని మోత్కూర్, ఆలేరు మున్సిపాలిటీలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కావాల్సిన సమాచారం సంబంధిత శాఖలు వారంరోజుల్లోగా అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోత్కూరు, ఆలేరు మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిమిత్తం విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, పొల్యూషన్, రోడ్లు, ప్రణాళిక, మైనింగ్, పోలీసు, పరిశ్రమలు, శాఖల సమాచార సేకరణపై స్టేక్ హౌల్డర్స్ అధికారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పట్టణ , గ్రామీణ అభివద్ధి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు నర్సింహారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టరు సత్యభామ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఏ విధంగా సమాచారం అందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. రాబోయే 2041 సంవత్సరం వరకు మున్సిపాలిటీలు ఎలా ఉండాలి అనే అంశంపై కావలసిన సమాచారం ఏ విధంగా అందించాలనేది వివరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఆలేరు మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యానాయక్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శంకరయ్య, అధికారులు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.