Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పోరాటాల ఖిల్లా... కమ్యూనిస్టుల పుట్టినిల్లు కర్వీరాల కొత్తగూడెం...పువ్వు పుట్టగానే పరిమలించినట్లు ఆ బాలుడు భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికిని నోరులేని మట్టి మనుస్సుల కోసం ఉదయించిన సూర్యుడిగా వెలిగై నాలుగు దిక్కుల ప్రకాశించినాడు.వెట్టి బానిసలై బతుకుతున్న బడుగు బతుకుకులకు భరోసా అయ్యితడని..దొరల భూస్వాముల ఆగడాలను ఎదిరించే ఆయుధమై పోరుజెండాయి పొలికేక అతడే అయితడని ఎవ్వరూ అనుకోలే..దొరల, భూస్వాముల ఆగడాలను చూసి ఉగ్రరూపం డాల్సి ప్రళయరుద్రుడై అగ్నిగుండంలోకి ఆయుధం పట్టుకొని దూకినాడు.శత్రువు గుండెల్లో సింహ స్వప్నమైనడు... ఆయన ఎవ్వరో కాదు పులిబిడ్డా భీమిరెడ్డి.తుంగతుర్తి ప్రాంతం కరవిరాల కొత్తగూడెంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఐదుగురు సంతానంలో పెద్ద కొడుకు.సాయుధ పోరాటంలో తనతో పాటు ఉద్యమంలోకి ఆయుధం పట్టుకొని అన్న అడుగుజాడల్లో నడిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం స్వయానా సోదరి...
15 ఏండ్ల వయస్సులో తన తండ్రి గోరెంట్ల దొరతో రైతులపక్షాన నిలబడి కలబడిన తీరు బీఎన్‌ను ఎంతో ఉతేజపరిచ్చింది.చుట్టుపక్కల గ్రామాలపై ఆ ప్రభావం పడింది.ఇంటికి వచ్చే పేద రైతులు వారిని ఆదరించే తల్లి తాపత్రయం చూసి ఆయనలో అన్యాయం మీద తిరుగుబాటు చేయాలనే బీజం పడింది.నల్లగొండలో చదువుతున్న సందర్భంగా వందేమాతరం నినాదంతో చిన్నతనంలోనే చిగురించిన నాయకత్వలక్షణాలు.పెద్దరైతుల ఇంటిలో పుట్టినప్పటికి కష్టజీవుల బాధలు,గాధలు, బరువులు, ఆకలిమంటలు కళ్లారా చూసి చలించారు.ఆయన ఇంట్లో మూగపాలేరు ఉండే వాడు.చాలా బలవంతుడు..నాగలి దున్నడం, గడ్డివాము వేయడం, బరువులు మోయడం, నారు మోయడం బీఎన్తో సమానంగా చేసేవాడు. ఎందుకో ఒక రోజు నీరసంగా కనిపించాడు. రెండురోజుల నుండి బువ్వ తినలేదని తెలిసి బీఎన్ చలించారు.అప్పుడు కష్టం చేసే వాళ్లకు తిండి ఎందుకు లేదు..ఎంత కాలం కష్టం చేయాలి.. వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ల పిల్లల సంగతి ఏమిటి అనే ప్రశ్నలు పేద ప్రజలపక్షాన నిలబడడానికి ప్రధానభూమిక అయ్యింది.గోరెంట్ల గ్రామం నుండి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన కమ్యూనిస్ట్ సాహిత్యం,లెనిన్ రాసిన పల్లెటూరి పేదలకు లేఖ, మాక్సింగోర్కీ రాసిన అమ్మ నవల ,1942లో రాజారెడ్డి, తన సోదరి శశిరేఖ, ప్రియంవధతో కలిసి 9వ ఆంధ్రామహాసభకు హాజరైన అనుభవం తననుపెద్ద ప్రభావితం చేసింది.మొదటిసారి కామ్రేడ్ పదం విన్నాడు, నిజాం వ్యతిరేక శక్తులందర్ని ఆ సమావేశం పరిచయం చేసింది.అరుట్ల దంపతులతో పరిచయం కుదిరింది.వెట్టిచాకిరితో వత్తి కులాలను భూస్వాములు కట్టుబానిసలుగా చేసింది.స్వంత ఆస్తి లేకపోవడం, పొద్దున లేచిన దగ్గర నుండి నడిరేతిరిదాక భూస్వాముల ఇండ్లలో పనిచేయాలి.కూలీ లేదు తిండి లేదు..అడిగేది లేదు.. అడిగితే బతికి బట్ట కట్టేదిలేదు ..తాళ్లు ఉచితం గా గీయడం, బట్టలు ఉచితంగా ఉతకడం... ఉచితంగా బట్టలు నేయడం,ఉచితంగా వ్యవసాయం చేయడం,ఆడవాళ్లు ఇండ్లలో పని చేయడం. స్వంత పనులు అంటూ ఉండేవి కావు... ఇదే వెట్టిచాకిరీ.ఇదంతా కూడా భీమిరెడ్డి పేద ప్రజల పక్షాన నిలవడానికి కారణమైంది.దేశం మొత్తం స్వాతంత్య్రం పొందిన సంబరాల్లో ఉంటే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా నిజాం ఎలుబడిలోనే ఉంది.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దయాదక్షిణ్యాలతో పరిమిత అధికారాలతో మనుగడ సాగించిన నైజాంచక్రవర్తి.చివరికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు తెలనొప్పిగా మారిండు.బ్రిటీష్‌కు తొత్తుగా మారిండు...నిజాంరాష్ట్రంలో 2600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్లు దేశపాండేలు ఉండే ఆధీనంలో 10 వేల గ్రామాలు ఉండేవి.మొత్తం 5కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది .ఇందులో కోటి 50 లక్షలు ఎకరాల భూమి జమీందార్ల కింద ఉంది.అన్ని గ్రామాలపై సర్వహక్కులు వీరికే ఉండే..ప్రజలపై పన్నులు వేయడం, అన్ని వర్గాల ప్రజలతో వెట్టి చేయించుకోవడం, దౌర్జన్యం చేయడం..ఎదురుతిరిగితే శిక్షలు వేయడం..పొద్దునదాక పనిచేయించుకోవడం, ఒక రకంగా ప్రజలకు ఏ హక్కులు ఉండేడివి కావు.ఈ ప్రభావమంతా బీఎన్ మీద పడింది. తెలంగాణ ాలో అమలు చేస్తున్న లెవ్వి గళ్ళ విధానంపై పోరాటం తొలిపోరాటమైంది.
మొండ్రాయి ఘటన
లంబాడీల పంటపొలాలను కాజేయలని కాడారి రమాచంద్రరావు అనే దేశ్‌ముఖ్ నిజాం మిలటరీని గిరిజనగూడెం మీదకు పంపించాడు.అది తెలిసి బిఎన్ దేవులపల్లి, యాదగిరి రావు వెళ్లి లాంబాడీలకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చారు.మొండ్రాయి గ్రామంలో భూస్వామ్య గూండాలు ఇది రష్యా కమ్యూనిస్టులకు ఇది రష్యా కాదు..రష్యా వెళ్ళిపోండని బ్యానర్ కట్టారు.
పాలకుర్తి పోరాటం బీఎన్‌కు స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ తెగింపు
పాలకుర్తిలో ఒక సాధారణ మహిళ,తనకున్న రెండెకరాల భూమిలో భర్త కొడుకుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ,వత్తిని నమ్ముకొని జీవిస్తుంది...విసునూరు రామచంద్రారెడ్డి దేశ్ ముఖ్ ఆగడాలు ఎదిరించా తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చింది.దొరల ఆగడాలు ఎదిరించా గ్రామం నడిబొడ్డున ఆంధ్రా మహాసభఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి రాకతో పెద్దసభ, వేలాదిమంది జనం చుట్టూరా గ్రామాల పెద్దఎత్తున వచ్చారు.సహించలేని విసునూరు గూండాలు అరుట్లపై హత్యాప్రయత్నం చేశారు.ఐలమ్మ భర్త, కొడుకు గూండాలపై ఒకే పెట్టున దూకి అడ్డుకున్నారు.కానీ జరగాల్సిన సభ ఆగిపోయింది.ఐలమ్మ ధైర్యం, తెగింపు, పోరాడేతత్వం గూండాలకు కంటాకింపుగా మారింది.ఎలాగైనా పొలం కాజేయలని కుట్ర, బెదిరింపులు, దౌర్జన్యం, ఒకటేమిటి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు.కామ్రేడ్ బీఎన్ దళం పాలకుర్తి చేరి పొలం కోసి ఇంట్లో పోసి అడ్డొచ్చిన విసునూర్ గూండాలను తరిమి కొట్టారు.ఈ పరిస్థితి దొరకు నిద్రపట్టలే, చుట్టూరా ఉన్న చిన్న చితకదొరలు,గూండాలను ఊరు చుట్టూ పెట్టుకుంది.బీఎన్ దళం, కొంతమంది వాలంటీర్స్ అన్నీ ప్రాంతాల నుండి వచ్చిన ఎర్రసైన్యం పెద్దఎత్తున దొరగడి ముందు పెద్ద ఊరేగింపు...ఎర్రజెండా జిందాబాద్, వెట్టిచాకిరి పోవాలి, దున్నేవానికే భూమి వంటి నినాదాలతో సాగుతున్న ఊరేగింపుపై గూండాలు దొంగచాటుగా గురిపెట్టి కాల్చారు.యువనాయకుడు కొమురయ్య గుండెకు తూటాదిగి నెలకొరిగారు.తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డికొమురయ్య మరణంతో కామ్రేడ్ బీఎన్ ఉద్రుక్తుడై సింహాల నలువైపులా గర్జించారు..పారిపోతున్న విసునూరు దొరల కచడాల వెంట బడి దొరికినోన్ని దొరికినట్లే గురిపెట్టి చావగొట్టారు.ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఎక్కడా అన్యాయం జరిగినా దొరగాల ఆగడాలు జరిగిన బీఎన్్ సెంట్రల్ దళం దిగాల్సిందే.బీఎన్ ఎన్నో చిత్రహింసలుకు గురయ్యారు.జైలు జీవితం గడిపారు. ప్రాణాపాయస్థితి నుండి క్షణాల్లో తప్పించున్నారు.పాతసూర్యాపేట, కోటపహాడ్,అనేక పోరాటఘట్టాల్లో స్వయంగా న్యాయకత్వం వహించారు.తన చెల్లెలు మల్లు స్వరాజ్యం కూడా చేరి ఆసాంతం అన్న బాటలో నడిచింది.దేవులపల్లిని తన గురువుగా ప్రకటించారు.ఆయన పోరాటం అనంతరం మూడుసార్లు ఎంపీగా, రెండుదఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు.ఎడారిగా మారిన తుంగతుర్తి,సూర్యాపేట,జనగామ ప్రాంతాలకు పోచంపాడు రెండవదశ కాలువనీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.చట్ట సభల్లో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.శ్రీరామ్‌సాగర్ రెండవదశ కాలువకు తను ఎంపీగా ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తిరుమలగిరి వద్ద ప్రగతినగర్‌లో శంకుస్థాపన చేయించిన ఫలితంగానే వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం పేరుతో శ్రీరామ్‌సాగర్ రెండవదశకు కాలువలు తీయించడంలో బీఎన్ త్యాగం ఎంతో ఉంది. నేను బతికిఉండగానే కాలువనీళ్లు చూడాలని,ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం పచ్చని పంట పొలాలుగా ఎదగాలని కల నిజమైంది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నీళ్లు వచ్చాయి.ప్రతి బీడు భూమి మాగాణి అయ్యింది.రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే భీమిరెడ్డి ఎర్రజెండా పట్టుకొని ప్రజలను సమీకరించి ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేసిన కారణం గానే ఈరోజు మనం చూస్తున్న కాలువలు.భీమిరెడ్డి తన కోసం కాకుండా ప్రజల కోసం బతికినోడు... చివరిదాకా కూడా అతి సామాన్యజీవితం గడిపారు.ఒకసారి సర్పంచ్ అయ్యినోడు భూమి మీద కాలు నిలవడం లేదు.ఆస్తి అంతస్తుల కోసం కాకుండా తనకున్న ఆస్తిని కూడా ప్రజా ఉద్యమాలకు దారబోసిన వ్యక్తి.నీతి నిజాయితీకి నిలువెత్తు విగ్రహం బీఎన్.సమాజంలో అందరికి సమానమైన అవకాశాలు రావాలని అది కమ్యూనిజం వల్లనే సాధ్యం అవుతుందని చివరిదాకా ఆదర్శగా కమ్యూనిస్టుగానే బతికిండు.సామాజిక ఉద్యమానికి సూర్యాపేట కేంద్రంగా జరిగిన ఉద్యమానికి పురుడుపోసిండు.అలాంటి త్యాగాల చరిత్ర కలిగిన వీరుడు మరణం సామాజిక ప్రజాఉద్యమాలకు తీరనిలోటు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా శ్రీరామ్‌సాగర్ కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరుపెట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నంగా నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకుందాం.ఆయన ఆశయాలు సాధించిన వాళ్ళమవుతాం ఇప్పటికే కొంతమంది మహనీయుల పేర్లు యూనివర్సిటీలకు, జిల్లాలకు, ప్రాంతాలకు పెట్టారు.ఎంతో చరిత్రకలిగిన మహనీయుని పేరు శ్రీరామ్‌సాగర్‌కు పెట్టి తెలంగాణ ప్రభుత్వం తన నిజాయితీని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం...జోహార్ కామ్రేడ్ బీఎన్.