Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ స్వాతంత్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ధర్మ పోరాటం చేస్తాం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట.
వీరతెలంగాణ సాయుధ పోరాటస్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూ మతంపేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన 'నవతెలంగాణ'తో మాట్లాడారు.భూస్వాములకు,నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో లిఖించదగ్గ పోరాటమన్నారు.10లక్షల ఎకరాల భూములు పంచడం కోసం వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి కల్పించడం కోసం 4 వేల మంది వీరులు ప్రాణత్యాగం చేసిన పోరాటం చరిత్రలో మరువలేనిదన్నారు.తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధంలేని బీజేపీ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తుందన్నారు.భూమి,భుక్తి,వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం జరిగిన మహత్తరవీర తెలంగాణా విప్లవ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిముల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ప్రజలకు సేవ చేయకుండా, మేలు చేయకుండా బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి కుట్ర సిద్ధాంతంతో తెలంగాణలో మత వైషమ్యాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.తెలంగాణ సాయుధపోరాటంలో స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనని బీజేపీ ఆ పోరాటంలో బ్రిటిష్ వారికి అమ్ముడు పోయి, వారితో లాలూచీ పడ్డ పార్టీ బిజెపి అని దుయ్యబట్టారు.స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి జాతిపితగా పేరుపొందిన గాంధీజీని చంపిన గాడ్సేని దేశభక్తుడని చెప్పడం దుర్మార్గమన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం గురించి సభలు పెట్టి చర్చించే నైతికహక్కు కూడా బీజేపీకి లేదన్నారు.బీజేపీ దేశాన్ని టోకుగా కాంటాలో పెట్టి అమ్మివేస్తుందన్నారు.ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలైన టెలికాం, విమానయానం, రైల్వే, విశాఖ ఉక్కును ప్రయివేట్వవారికి అమ్మారన్నారు.తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తితో ఇంకా పరిష్కారం కానీ భూ సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు.తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు తన తల్లిగారైన మల్లు స్వరాజ్యం లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తంచేశారు.ఆమె స్పూర్తితో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు.