Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరాటం
- నల్లగొండ నుంచే రాష్ట్రమంతా రాజుకున్న ఉద్యమంతో చైతన్యంగా కదిలిన గ్రామాలు
- పోరాటంలో నేలకొరిగిన వందలాది మంది యోధులు
- ఇండియన్ యూనియన్లో తెలంగాణ విలీనమై నేటికి 76 ఏండ్లు
నవతెలంగాణ-చిట్యాల
సొంతిల్లు.. సొంతూరు.. అయినా అనుక్షణం భయం.. భయం. అయినవాళ్ల మధ్యనే ఉన్నా ఉలికిపాటు.. గుర్రపు డెక్కల చప్పుడు వింటే గుండె దడ. రజకార్ల పొలికేక విన్పిస్తే మత్యువు ముంచుకొచ్చినట్లే. జీవితమే రణరంగంలా మారిన తరుణంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నేతత్వంలో అయ్యా నీ భాంచన్ దొర కాల్మొక్తాన్న చేతులు బంధూకులు పట్టాయి. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసే అందిందల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఆయుధాలుగా మారాయి. నైజాం రాజులను తరిమికొట్టడానికి ప్రత్యేక ఉద్యమ బలగాలు తయారయ్యాయి. నిజాం రాజులకు ఎదురుతిరిగి ముచ్చేమటలు పట్టించాయి. మహౌన్నత చరిత్ర కలిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది విశిష్ట స్థానం. ఇక్కడ రాజుకున్న నిప్పు.. తెలంగాణ అంతా పాకింది. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు.
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సాయుధ పోరాటం
నిజాం పాలనలో చోటుచేసుకున్న అకత్యాలకు సజీన సాక్ష్యం ఈ మసీదు. ఈ మసీదు సాక్షిగా వందల మందిని ఊచకోత కోశారు నాటి రజాకార్లు. నిజాంకు వ్యతిరేకంగా మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల మండలం గుండ్రాంపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. గుండ్రాంపల్లి మసీదు కేంద్రంగా నిజాం పాలకులు ఏర్పాటు చేసిన రజాకార్ల లైసెన్స్ కిల్లర్ ఖాసిం రజ్వీ ఆగడాలు కొనసాగించారు. ఇప్పటి సూర్యాపేట జిల్లా వర్ధమానుకోటకు చెందిన సయ్యద్ మక్బుల్ సోదరి ఇంటికి జీవనోపాధికి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి వచ్చి నాటి మజ్లిస్ సంస్థలో చేరి దళ నాయకుడిగా ఎదిగాడు. కొంత మందితో దళాన్ని ఏర్పాటు చేసుకొని ఖాసీం రజ్వీకి అనుచరుడయ్యాడు. ఈ మసీదును కేంద్రంగా మక్బుల్ ఈ ప్రాంతంలో చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలకు లెక్కే లేదు. తన ఆగడాలకు అడ్డుగా వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపేవాడు.
రజాకారులను ఎదిరించిన కమ్యూనిస్టు దళాలు
అప్పట్లో కమ్యూనిస్టు దళాలు, రజాకార్లకు నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. మక్బూల్ ఇంటిపై కమ్యూనిస్టు దళాలు చేసిన దాడిలో మక్బూల్ భార్య, కూతురు చనిపోయారు. దీంతో ప్రతీకారంతో మక్బూల్ రగిలిపోయాడు. కమ్యూనిస్టు దళసభ్యులు, ఇతరులను 350 మందికి పైగా ఊచకోత కోసి మసీదు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడేసి తన రాక్షసతత్వాన్ని చాటుకున్నాడు. మక్బూల్ ఆకత్యాలు అరాచకాలకు అంతులేదని, గ్రామానికి చెందిన 350 మందికి పైగా బలయ్యారని అప్పటి సమరయోధులు గుర్తు చేస్తున్నారు. గుండ్రాంపెల్లి గ్రామస్తుడు ఎసిరెడ్డి బుచ్చిరెడ్డి 8 ఏళ్ల వయసులో జరిగిన సాయుధ పోరాటం గురించి వివరించారు.
' రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం '
నేను మా గుండ్రాంపల్లి గ్రామానికి 16 సవంత్సరాలు సర్పంచ్ సేవలందించాను. నా చిన్నతనంలో 8 సంవత్సరాల వయసులో మా గ్రామంలో గల సయ్యద్ మక్బూల్ అనే రజాకార్ల నాయకుడు ఎన్నో అరాచకాలు చేసి ఎంతో మందిని సజీవ దహనం చేసినాడు. అందుకు చిహ్నంగా మా గ్రామంలో సమరయోధుల స్థూపం ఏర్పాటు చేయడమైంది. ఈ రజాకార్ల నాయకుడు మా ఆస్తులు కొల్లగొట్టినాడు. మేము గ్రామం విడచి ఆలేరు గ్రామం మదిర గుండ్లగూడెంలో 1947 సవంత్సరంలో బావులు, వాగు పక్కన గల వనంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాత వాసం చేసినాం. రజాకార్లకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన వారికి, నా చిన్న వయసులోనే అడవిలో వారికి కావలసిన అన్నం, ఇతర వస్తువులను పెద్దల సహాయంతో అందించాను. ఎంతో చరిత్ర ఉన్న మా ఊరు ప్రపంచం ముందు మిణుకు మిణుకు మంటూ బుడ్డిదీపం లాగ వెలుగుతూ మరుగునపడుతున్న చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని కోరుతున్నాను.