Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తించని ప్రభుత్వాలు
- కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి
నవతెలంగాణ-సూర్యాపేట
నిజాం ప్రభుత్వాన్ని, రజాకార్లను గడగడలాడించి వారి గుండెల్లో నిద్రపోయిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దాసరి కోటయ్య.చివరిదశలో మట్టిగోడల మధ్యనే దీనావస్థలో తనువు చాలించాడు.నిజాం ప్రభువు కబంధహస్తాల నుండి తెలంగాణ ప్రజల ధన, మానప్రాణాలను కాపాడిన ధీరశాలి.అనర్హులు అందరికీ పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాలు పోరాట యోధుడికి మాత్రం ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి.జిల్లాలోని నూతనకల్ మండలం వెంకేపల్లి (ఎలకపల్లి) గ్రామానికి చెందిన దాసరి కోటయ్య యుక్త వయస్సు నుండే సాయుధ పోరాటానికి ఆకర్షితుడయ్యారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోరాటయోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి దళంలో సెంట్రీ గా పనిచేస్తున్న 'బండెనక బండి కట్టి పదహారేడ్ల బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడకో నైజాము సర్కరోడా' అనే పాట సష్టికర్త నాగేల్లియాదగిరి దళంలో కోటయ్య సభ్యుడిగా చేరారు.నాటి రజాకార్ల లాఠీ, తూటా దెబ్బలను ధైర్యంగాఎదుర్కొన్నారు.ప్రధానంగా నాటి పోరాటాలలో తుపాకీ పేల్చినవారిలో కోటయ్య కీలకంగా పేరుగాంచారు.పలుమార్లు జైలుకి వెళ్ళారు.నిజాంసర్కార్ పెట్టిన చిత్రహింసలకు గురయ్యారు.వాటిని పంటిపట్టున బిగబట్టి పోరాటాలు చేసిన వీర సైనికుడు కోటయ్య.నాడు గన్‌పెట్టి నిజాం ప్రభువును ఎదురొడ్డి పోరాడిన సైనికుడు కోటయ్య చివరిదశలో మాత్రం సొంతగ్రామంలో దుర్భర జీవితం గడిపారు.భార్య అచ్చమ్మ 50 ఏండ్ల కిందటే చనిపోయింది. కూతుళ్లు ఎల్లమ్మ, సూరమ్మలు అత్తారింటికి వెళ్లి పోయారు.కుమారులు రామస్వామి, ముత్తయ్యలు బతుకుదెరువు కోసం కుటుంబాలతో వలస వెళ్లారు.ఇక మిగిలిన కోటయ్య తనకు చెందిన మట్టిగోడల మధ్యనే కొన్నేండ్లుగా అర్ధాకలితో పరితపిస్తూ గడిపారు.ఈ క్రమంలోనే గ్రామస్తులు పూటకు ఒక్కరు చొప్పున కోటయ్య గ్రామస్తులు అన్నం పెడుతూ వచ్చారు.ఈ క్రమంలో అతనికి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయం అందలేదు.కొన్నేండ్ల కిందట ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆ పెన్షన్ మంజూరు కాకపోవడంతో పాటు ఎందరో అనర్హులు తన కళ్ళ ఎదుట పెన్షన్లు ఎత్తుకుంటూ దర్జాగా జీవిస్తుంటే నిజమైన పోరాటం చేసిన తనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం పట్ల కోటయ్య మనోవేదనకు గురయ్యారు.ఈ క్రమంలోనే పెన్షన్ అందుకోకుండానే స్వగ్రామంలో కన్నుమూశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలొడ్డి పోరాడిన పోరాట యోధులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి దుర్భర పరిస్థితి అగమ్యగోచరంగా గడిచింది.రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం ఆ పోరాటయోధుల జ్ఞాపకాలను స్మరిస్తూ నేటితరానికి దిక్సూచిగా నిలవాలని పలువురు కోరుతున్నారు.