Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విముక్తి కై విప్లవ శంఖం పూరించిన కమ్యూనిస్టులు
- నాటి, నేటి తరానికి వారే ఆదర్శం
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
అయ్యా నీ బాంచన్ కాళ్లు మొక్కుతా.. అన్నవాడే ఆయుధం చేతబట్టి నాకు మీతో సమానంగా జీవించే హక్కు ఉన్నదని ఎదురు తిరిగిన ఘనత ఆనాటి యువకులది. సెప్టెంబర్ 17 తర్వాత రజాకార్లు లొంగిపోవడంతో దొరలు, భూస్వాములు అధికారుల దౌర్జన్యం వెనుక పట్టు పట్టింది. కానీ అంతకు పూర్వం నిజాం ప్రభువుకు ఇష్టమైన (ధూమిటోపి) ఎర్ర టోపీ, శర్వాణి ధరించిన భూస్వాములు గాంధీటోపి, కద్దర్ ధరించి అపర గాందేయవాదులుగా అవతారం ఎత్తి గ్రామాలలోకి మిలిటరీ సహాయంతో రావడం మొదలైంది. వారి భూములను ఆక్రమించిన వారిని పిలిచి సంధి ప్రయత్నాలు చేసి చౌకగా తమ భూమిని విక్రయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దళ నాయకులు గ్రామాలలోకి వచ్చినప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతూనే వారిని మిలిటరీకి అప్పగించి ద్వంద నీతిని అనుసరించారు. ఆ విధంగా అనేకమంది దల నాయకులు లొంగిపోవడం లేక భారత సైన్యంతో తలబడి అసువులు బాయటం జరిగేది. క్రమక్రమంగా కమ్యూనిస్టు దళాలు గ్రామాలలోకి వచ్చి పెత్తనం చేస్తే దొరల భూములు కొనుటకు కష్టమని భావించారు. అది కేవలం భూమిలేని పేదలకు దక్కే పరిస్థితి ఉన్నందున కొద్దో గొప్పో వసతి ఏర్పడ్డ మధ్యతరగతి ధనిక రైతాంగం క్రమంగా దళాలకు దూరం కావడం మొదలైంది. దొరల భూములను కౌలు పేరున, లోపాయ కారికంగా ఖరీదు చేసో తమ ఆధీనంలోకి తెచ్చుకునేవారు. క్రమంగా భారత సైన్యం గ్రామాలలో తరచూ వచ్చి దళాలకు సహకరించే వారిని హింసించడం, స్త్రీలను అవమానపరచడం వంటివి చేయడం ఎక్కువైంది. కమ్యూనిస్టు పార్టీ పైన దేశవ్యాప్తంగా నిషేధం లేకపోయినా నైజాం సంస్థానంలో మాత్రం నిషేధం ఉండేది. కమ్యూనిస్టు పార్టీలో అంతరంగిక చర్చ మొదలైంది. భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. ఆంగ్లేయుల నుండి విముక్తి సాధించి నిజాంను గద్దె దింపింది. కనుక దానితో పోరాడవలసిన పనిలేదని కొందరు చర్చ జరిపారు. కానీ వాస్తవానికి ఇంతకాలంగా చేస్తూ వస్తున్నా పోరాటం వలన దున్నేవానికి భూమి రాలేదు. దళాలు పంచిన భూములు తిరిగి భూస్వాములు స్వాధీనం చేసుకోవడానికి మిలిటరీ సహాయపడింది. ప్రజాస్వామ్య హక్కులు ప్రజలకు దక్కడం లేదు. కనుక ఈ భారత ప్రభుత్వాన్ని ఎదిరించడమే మంచిది అనే వాదన కూడా బలపడ్డది. ఈ సంధి కాలంలో వేలాది కమ్యూనిస్టు నాయకులను భారత సైన్యం పిట్టల వలె కాల్చి చంపింది. వారికి సహాయపడిన వారినీ హింసించడం తీవ్రమైంది. దీంతో దళాలు గ్రామాలలోకి రావడం కష్టమైంది. తప్పనిసరి అయ్యి అడవులు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లక తప్పలేదు. నల్లమల్ల అడవులలో కొందరు, ఆదిలాబాద్ భస్తర్ కు మరికొందరు రక్షణకై వలస వెళ్లక తప్పలేదు. దీంతో అప్పటివరకు గ్రామాలలో ఏర్పాటుచేసిన కమిటీలు నిర్వీర్యం కావడం మొదలైంది.
జీవన విధానంలో కొంత మార్పు...
ఈ దశలో భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆమోదం పొంది అమలులోకి తెచ్చింది. దీంతో జనరల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. దళాలు గ్రామాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు గ్రామాలకు వచ్చి ప్రజలను ఉత్తేజపరిచేవారు. కొన్ని క్యాంపులు నిర్వహిస్తూ రాత్రిపూట చదువులు నేర్పేవారు. ఆయుధాలు సేకరించి అవకాశం వచ్చిన సందర్భంలో మిలటరీ పై దాడి చేసి హతమార్చిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రజలు ఓవైపు వెట్టిచాకిరి, దొరల పీడ తగ్గిందని ఊపిరి పీల్చుకోవడం మొదలైంది. మరోపక్క మధ్యతరగతి జనం తమ పాత బాకీలు రాబట్టుకోవడానికి, ధాన్యం నాగు వసూలు చేయటానికి పూనుకోవటం గ్రామాలలో తిరిగి వారిపై ఒత్తిడి పెంచడం మొదలైంది. అమాయక ప్రజలు అణిగిమనిగి ఉండే పరిస్థితి తిరిగి ముందుకు రావడం మళ్లీ ఆరంభమైంది. అక్కడక్కడ భూస్వాములు వెట్టిచాకిరి చేయించుకోవడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
భారత ప్రభుత్వం దున్నేవానికి భూమి పంచడానికి సిద్ధంగా లేదు. కానీ రక్షిత కౌలుదారి చట్టం లాంటివి తెచ్చి భూమి నుండి కాస్తు చేసుకున్న వారికి రక్షణ కలిగించేవారు. తెలంగాణలో భూమి అమ్మాలన్న కొనాలన్న ఆర్డీవో స్థాయి అధికారి అనుమతి ఇస్తేనే కొనే అవకాశం ఉండేది. దీని ద్వారా తప్పుకునేందుకు లాయర్లు, న్యాయ కోవిదులు, ఏక్ బాల్ డిగ్రీ (ఈ భూమి నాది కాదు పేరు మాత్రమే ఉన్నది నా పేరు మార్చిన అభ్యంతరం లేదు.) దీంతో ధనిక రైతులు అప్పుడప్పుడే పెరుగుతున్న ఉన్నత, మధ్య తరగతి రైతులు దొరల భూములను లోపాయకారికంగా బేరమాడి ఈ ఎగ్ బాల్ డిగ్రీ ద్వారా రికార్డుల్లో మార్పు చేయించేవారు. గ్రామీణ వ్యవస్థలో భూమి కేంద్రీకరణ వందల వేలు ఎకరాలు ఒక్కడే కలిగి ఉండే విధానాన్ని నుండి క్రమంగా ధనికా, మధ్యతరగతి రైతుల ఆధ్వర్యంలోకి భూమి రావడంతో గ్రామీణ వ్యవసాయ విధానంలో రైతాంగ జీవన విధానంలో కొంత మార్పు చోటు చేసుకుంది.
నాటికి, నేటికి, ఎప్పటికీ చెరగని ముద్ర వారిదే...
కమ్యూనిస్టు పార్టీ దళాలు గ్రామాలలోకి వస్తే నమ్మించి, ఆదరించినట్లు నటించి మిలిటరీకి పట్టించేవారు. వెట్టిచాకి నిర్మూలించిన తీరును ఆకలింపు చేసుకొని వారికి గౌరవం చూపేవారు. పార్టీ శ్రేణుల్లో వచ్చిన చర్చలు తీవ్రమైనవి. తుదకు పోరాట విరమణ చేయాలా, వద్దా అన్న చర్చ తీవ్రమైంది. అప్పటికే విదేశాలలోని నాయకులతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలకు రాక తప్పలేదు. నిజాం ప్రభుత్వంతో పోరాటానికి, భారత సైన్యంతో పోరాడడానికి ఉన్న వ్యత్యాసం చర్చకు వచ్చింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలను పొంది స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చినదిగా గుర్తింపు ఉన్నది. అందువల్ల నిజాం నిరంకుశ పరిపాలన ప్రజల చేత నిరసింపబడ్డ ప్రభుత్వంగా అప్రతిష్టకారకంగా వ్యవహరించేదిగా గుర్తింపు వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనంలోకి తీసుకోవాలని చర్చలు జరిపారు.
అప్పటివరకు నైజాం సంస్థానంలో ఎన్నికలే లేవు. ప్రజా ప్రాతినిధ్యం లేనేలేదు. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గాలు ఎన్నికలు జరుపుటకు పాలకవర్గం ముందుకు వచ్చింది. గాంధీ టోపీలతో ఖద్దరు ధరించిన నాయకులు రంగం మీదికి వచ్చి ప్రజలను ప్రలోభ పెట్టడం మొదలైంది. తమనే ఎన్నుకోవాలని ప్రచారం సాగించారు. 1952 చివరలో మొదట్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారత కమ్యూనిస్టు పార్టీపై నిజాం సంస్థానంలో నిషేధం ఉన్నది. కనుక పీపుల్స్ డెమోక్రసీ ఫ్రంట్ (పీడీఎఫ్) పేర కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోటీ చేశారు. నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు పిడిఎఫ్ అభ్యర్థులుగా కమ్యూనిస్టులే గెలిచారు. అందులో రావి నారాయణరెడ్డికి దేశ ప్రధాని నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. క్రమంగా 4000 మంది అమరులైన ఈ గడ్డపై పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన, వెట్టి చాకిరి నిర్మూలనకు కషి చేసిన కమ్యూనిస్టు పార్టీ ప్రజా హదయాలలో చాలాకాలం నిలిచింది.
సమ సమాజ స్థాపన కై....
మూడు తరాల తర్వాత ప్రజల్లో నేటి ఆర్థిక పరిస్థితుల దష్ట్యా ఆశలు పెరిగి అవకాశాలు అందుకోవచ్చు అనే దురాలోచనతో నేటి యువతరం కమ్యూనిస్టు పార్టీకి దూరం కావటం ఎక్కువైంది. ప్రజల్లో ఆనాడు ఒకే పార్టీ, ఒకే విధానం ఉండేది. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే దోపిడీ లేని రాజ్య స్థాపనకు కషి చేస్తుందని నమ్మిన తరం ఆనాటిది. ఈనాడు అన్ని పార్టీలతో పాటు ఇదొక పార్టీ అని మాత్రమే జనం గ్రహిస్తున్నారు. గ్రామాలలో దొరల పెత్తనం పోయి మధ్య దళారీలు, కొత్త భూస్వాములు పెత్తనాలు సాగించడం మొదలైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి డబ్బులు లాగటం, బెదిరింపులు చేయడం ఎక్కువైంది. ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి నేటి యువతరం ఆనాటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపనకై దోపిడీ లేని వ్యవస్థ కై ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.