Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వేల మంది అమరులు..
- 10లక్షల ఎకరాల భూమి పంపిణీ..
- 1951 సెప్టెంబర్ 17న విలీనం....
ఆసఫ్జాహీ వంశస్తుల పాలనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. హైదారబాద్ సంస్థానానికి చెందిన ఆఘోరనాథ ఛటోపాద్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం లాంటి ప్రముఖులు తెలంగాణలో కొంత చైతన్యాన్ని రగిలించారు. కానీ వారి ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. 20శతాబ్ద ప్రారంభం నుంచి తెలంగాణలో జాతీయ చైతన్యం కలిగిందని చెప్పొచ్చు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానం నేటి తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, మహాబూబ్‌నగర్ వీటితోపాటుగా నాడు నూతనంగా ఏర్పడిన రంగారెడ్డి, ఖమ్మం, మహారాష్ట్రలో ఔరంగబాద్, బీడు, పర్బనీ, నాందేడు, ఉస్మానాబాద్, కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్‌లలో ఈ సంస్థానంలో పరిపాలన కేంద్రీకృతమై ఉంది. మొత్తం తెలంగాణ వైశాల్యం 5.30కోట్లు. తెలంగాణ మొత్తం గ్రామాల సంఖ్య 10,167, మరట్వాడా, కన్నడ ప్రాంతాల గ్రామాల సంఖ్య 12,290 ఉన్నాయి. జనాభా వారిగా తెలంగాణలో 54శాతం, మరట్వాడా 26శాతం, కన్నడ 20శాతం ఉంది. నాడు భూమి కొంతమంది చేతుల్లోనే ఉండేది. భూస్వాములు, జాగీర్దారులు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల ఆదీనంలో భూమి ఉన్నది. గ్రామాలలో వీరికి అనుకూలంగా పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. వీళ్లంతా కలిసి ప్రజలను బానిసలుగా, వెట్టిచాకిరి చేయించడం, సామాజికంగా అణిచివేతకు గురిచేసేశారు.దీనివల్ల ప్రజలో తీవ్ర అసంతృప్తి రగిలింది.
1946లో మొదలైన సాయుధ పోరాటం..
తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు ఏర్పడిన ఆంద్రమహాసభ ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీగా మారిపోయింది. ప్రజలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 11న మొదలైంది. ఆ తర్వాత 1951లో సెప్టెంబర్ 12 రాత్రి నుంచి నైజాం పాలకులపై ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్యను చేపట్టారు. కేవలం నాలుగు రోజుల పోరాటం తర్వాత సెప్టెంబర్ 17 నైజాం పాలకులు చేతులెత్తేయడంతో తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్య్ర దేశంలో విలీనమైంది. పెద్దఎత్తున వర్గపోరాటం ప్రారంభమైంది. కులాలకు, మతాలకు అతీతంగా సంఘం నాయకత్వాన ఐక్యంగా పోరాటం మొదలుపెట్టారు. దొడ్డి కొమురయ్య మరణం తర్వాత రైతులలో ఉన్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్ల జేసింది. ఈ ఉద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వర్లు (డిఎన్) ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, మల్లు స్వరాజ్యం, చకిలం యాదగిరి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, చిత్రపురి లక్ష్మినర్సయ్య, మంచికంటి రాంకిషన్రావులతో పాటుగా అనేక మంది యోధులు ఈ పోరాటంలో వివిధ దశల్లో, అనేక రూపాల్లో ఉద్యమానికి అండగా ఉన్నారు.
10లక్షల ఎకరాల భూ పంపిణీ...
తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా నైజాం ప్రాంతంలోని 3వ వంతు భూబాగంలో 3వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. దున్నేవారికి భూమి పేరుతో నినదించి బంజరు భూమల పంపిణీతో 10లక్షల ఎకరాల భూమిని భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌ల వద్ద ఉన్న భూమిని కమ్యూనిస్టులు జెండాలు పాతి స్వాదీనం చేసుకున్నారు. ఆ భూమినంతటి పేదలకు పంపిణీ చేశారు. అంతేగాకుండా ఈ సందర్బంగానే తాకట్టు భూముల విడుదల, పశువుల పంపిణీ, రుణపత్రాల రద్దు, వ్యవసాయ కార్మికుల వేతనాల పెంపు, పన్ను వసూళ్ల రద్దు తదితర వాటిని సాధించారు.
4వేల మంది మరణం...
నైజాం పాలనలో ఉన్న వెట్టిచాకిరి, సామాజిక అణిచివేత, దోపిడి, అడ్డుకునేందుకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటంలో సుమారు 4వేల మంది అమరులయ్యారు. అందులో కడవెండి గ్రామానికి చెందిన మొదటి అమరుడు దొడ్డి కొమురయ్య 1946 జులై 4న విసూనూరి దొర రామచంద్రారెడ్డి గుండాల చేతిలో కాల్చివేయబడ్డారు. అయితే ఇందులో నైజాం పాలనలో జరిగిన పోరాటంలో 15మంది అమరులైతే, యూనియన్ మిలటరీ 1947 పాలనలో దాదాపు 2500మంది మరణించారు. మొత్తంగా 4వేల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించారు.