Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చండూరు
వర్తమానానికి మధ్య చరిత్రను తెలియ చెప్పేందుకే ఈ వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ లో భాగంగా సమావేశంలో ఆయన మాట్లాడారు.కులాల పేరుతో,మతాల పేరుతో విచ్ఛిన్నానికి బిజెపి కుట్రలకు తెర లేపుతోందని, ఆ ఉచ్చులో తెలంగాణా సమాజం పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 న జరుపుకునేది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమేనని ఆయన స్పష్టం చేశారు. చరిత్ర తెలియని వారు వక్రీకరించి చెప్పే బాష్యాలు తగవులు పెట్టేందుకేనని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అని అది యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్రం సిద్దించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. హిందు,ముస్లిం,క్రిస్టియన్ లు ఇక్కడ సోదర భావంతో కలిసిపోయారని చెప్పారు. అంతకుముందు పట్టణకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, నాంపల్లి ఎంపీపీ శ్వేత రేవంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవి వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.