Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న సిమెంట్, స్టీల్, ఇసుక నిర్మాణ ముడి సరుకులు ధరలు తగ్గించి కార్మికుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్లగొండ జిల్లా విస్తత సమావేశం శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో బి.దయానంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు పడిపోయి ఆదాయం తగ్గిపోయాయనారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం విద్య, వైద్యం మరింత ఖరీదు కావడం కార్మికుల జీవిత అవసరాలు తీరక పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిమెంట్, స్టీల్ ఇసుక నిర్మాణ రంగానికి అవసరమైన ముడి సరుకుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణాలు బాగా తగ్గిపోయి కార్మికులపై ఉపాధి పై తీవ్ర ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు అది అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ సకాలంలో అందడం లేదని, క్లైముల కోసం వెల్ఫేర్ బోర్డు కార్డుల కోసం కార్మికులు లేబర్ అధికారుల చుట్టూ చెప్పులరిగే లాగా తిరుగుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా లేబర్ అధికారులు పెండింగ్ క్లైమ్ లన్నిటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల12వ జిల్లా మహాసభ కనగల్లులో జరగనుందని, ఈ మహాసభల జయప్రదానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ కానుగు లింగస్వామి, బి సైదులు, కేశవులు, వెంకన్న, బిఎం నాయుడు, ఇన్నయ్య, పరమేష్, యాదయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.