Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాళ్ల దాష్టికాలను తుదముట్టించింది ఎర్రజెండా
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నాటి కాశీం రజ్వీ ఆగడాలను హిందూ జాగీర్దార్లు జమీందార్లను తుదముట్టించింది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల భాగంగా కనగల్ మండలం తేలుకంటి గూడెంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బోగరీ భాషలయ్య త్యాగాలను స్మరిస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..దున్నేవాడికే భూమి కావాలని వెట్టిచాకీరి నుంచి విముక్తి పొందాలని, గ్రామాలలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు విలసిల్లాలని సాయుధపోరాటం నడిపింది ఎర్రజెండా మాత్రమేనని తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనన్నారు. కొందరు మత ఉన్మాదులు సాయుధ పోరాటానికి మేమే వారసులమని దుష్ప్రచారం చేస్తున్నారని, హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కనీస అర్హత కూడా లేదని, తెలంగాణ సాయుధ పోరాట రూపురేఖలు కూడా తెలియని మూర్ఖులని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరిగిన పోరాటాల్లో ఏ గ్రామ చరిత్ర చూసినా ప్రతీ గ్రామంలో సాయుధ పోరాట అమరుల ఉన్నారని వారి త్యాగాలను కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర విస్తతంగా ప్రజలకు తెలియాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అటు వైపు అడుగులు వేయాలన్నారు. రాబోయే తరాలకు తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుల సైదులు, మండల కమిటీ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, మారయ్య, సుల్తానా, అంజి, బోగిరి బిక్షం, భువనగిరి రామకోటి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బోనగిరి సుకుమార్, భూజాత, లక్ష్మమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.