Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వంసమైన ద్వారకుంట-కాపుగల్లు రహదారి
- రైతుల పొలాలవద్దకు వెళ్లాలంటే భయపడుతున్న వైనం
నవతెలంగాణ కోదాడరూరల్
మండలంలోని కాపుగల్లు గ్రామశివారులో నెమలిపురి కాలనీ కాపుగల్లు వెళ్లే ప్రధాన రహదారి మట్టి టిప్పర్లతో ధ్వంసం కావడంతో ఆగ్రహించిన రైతులు మట్టిటిప్పర్లను కంచే వేసి ఆదివారం అడ్డుకున్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలపరిధిలోని కాపుగల్లు రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 292లో కోదాడ ఖమ్మం జాతీయ రహదారి విస్తరణపనులకు మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు.ఈ టిప్పర్లు అధికలోడుతో వెళ్లడంతో నెమలిపురి- కాపుగల్లు మధ్య ఉన్న రహదారి మొత్తం ధ్వంసమైందన్నారు.అంతేకాకుండా పెద్దపెద్ద బూతులు ఏర్పడడంతో 40 ఎంఎం కంకరపోసి గుంతలను పూడ్చడంతో ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం గుండా వెళ్లలేక అనేకసార్లు కింద పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.అంతేకాకుండా ఈ టిప్పర్లు అతివేగంగా వెళ్లడం వలన పొలాలకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎడమ కాలువ హాలియా వద్ద తగడంతో పొలాలకు నీళ్లు అందడం లేదని బాధపడుతుంటే ఈ టిప్పర్ల ద్వారా వచ్చే దుమ్ము దూళితో పొలాలు చీడ పట్టినట్టుగా ఎర్రగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని మంచిగా వున్న రోడ్లను ధ్వంసం చేశారని ఆగ్రహించారు.అధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఈ టిప్పర్లను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.మా గ్రామానికి కచ్ఛితంగా రహదారిని ఏర్పాటు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై సాయిప్రశాంత్ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకొని కంచే తొలగించి వారితో మాట్లాడారు.వారి మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది.కచ్ఛితంగా పరిష్కరించాలని కొంతమంది రైతులు భీష్మించుకుని కూర్చున్నారు.సమస్యను పై అధికారుల దష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో రైతులు, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.