Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చీరామ్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో నెలకొన్న ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లచ్చీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక ఆర్ఆర్ఆర్ ఏసీ బంకెట్ మినీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు నాలుగేండ్లుగా బదిలీలు,ఏడేండ్లుగా పదోన్నతులు, 17 ఏండ్లుగా ఎంఈఓ పోస్టుల భర్తీ లేకపోవడంతో పాఠశాల విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొందన్నారు.ఉన్నత పాఠశాలలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేరని తెలిపారు.ఎంఈఓలు లేకక్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మన బడి, ఆంగ్లమాద్యం, ఎఫ్ఎల్ఎన్ తదితర పథకాలు పకడ్బందీగా అమలు జరగాలంటే అన్ని జిల్లాలకు డీిఈఓ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేసి డీఈఓ, డిప్యూటీఈఓ, ఎంఈఓ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని తీర్మానిం చామన్నారు.317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని,జీఓ 317 ద్వారా చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన కారణంగా అనేకమంది జూనియర్ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారని, భార్యాభర్తలు దూరమయ్యారన్నారు.జీఓ అమలుతో ఏర్పడిన సీనియారిటీ, స్పెషల్ క్యాటగిరీ, 13 జిల్లాలతో సహా భార్యా భర్తల సమస్యలపై పెండింగ్‌లో ఉన్న అప్పీల్స్ అన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకం అయిన ఉద్యోగుల కుటుంబాల సామాజికభద్రతకు ముప్పుగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, 2020 ఏప్రిల్ నుండి సర్వీసు పర్సన్స్ నియామకం లేక పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత అప్పగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు జరగడం లేదన్నారు.అవసరమైన చోట విద్యా వాలంటీర్లను నియమించాలని, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందలేదన్నారు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు విద్యార్థు లందరికీ అందించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బేర దేవన్న,రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.రఘునందన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మురళీమనోహర్‌రెడ్డి,రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి పి.మొగులయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.గోపాల్, రాష్ట్ర సహాధ్యక్షులు దామెరశ్రీనివాస్, నూతనకంటిబాబు, సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కస్తూరి కిషన్ ప్రసాద్,మామిడి అరవింద్, రాష్ట్ర నాయకులు ఊట్కూరి జానకి రాములు, ధరణికోట రవికుమార్, యర్రంశెట్టి చలమందరావు, గద్దలచంద్రశేఖర్, జిల్లా నాయకులు గన్న శ్రీనివాస్, నోములవెంకన్న,దంతాల జోహార్, శివరాత్రి వెంకన్న,నక్కపోతు శ్రీనయ్య,,మహ్మద్ షఫి, తాటిపాముల శ్రీనివాసచారి,అక్కినపల్లి శ్రీనివాస్, కటకం నర్సింహాస్వామి,వి.వెంకన్న, జిల్లా మహిళా నాయకులు పి.నీరజ,లత, బి.నీలిమ,ఎల్. పుష్పలత,ఎస్.మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.