Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడలు, కాయలను తినేస్తున్న వైనం
- పత్తి దిగుబడిపై ప్రభావం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పత్తి సాగు అతి ప్రధానమైంది.వరి తర్వాత రైతులు ఎక్కువగా సాగు చేయడానికి ఉత్సహం చూపే పంట అది.సాగునీటి అవకాశాలు లేని ఏరియాలో ఈ పంటను సాగు చేస్తుంటారు.ఇది పూర్తిగా వర్షాధారిత పంట అయినప్పటికి సాగునీరు అందుబాటులో ఉంటే కూడా ఈ పంటకు ఉపయోగిస్తారు.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పత్తిచేనుపై పచ్చపురుగు( లద్దెపురుగు) పెద్దఎత్తున దాడి చేస్తుంది.ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పత్తి మొక్క ఎదుగుదల లేకుండా పురుగు తినేస్తుంది.అలా తినడం వల్ల పత్తి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.అందుకే రైతన్నలు వేల రూపాయలను సాగుకు ఖర్చు చేసి, ఈ పురుగుదాడితో ఆందోళనలో ఉన్నారు.ఈ పురుగును నివారించడానికి వ్యవసాయశాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
6.50లక్షల పత్తి సాగు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి సాగు సుమారు 6.50లక్షల ఎకరాలలో సాగు చేశారు.అందులో సూర్యపేట జిల్లాలో 1.25లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,10,344 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 4.15లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారు. వాస్తవంగా సాగునీటి వసతి లేని ప్రాంతాలలో పత్తిసాగును ఎక్కువగా చేస్తుంటారు.నల్లగొండ జిల్లాలో అయితే మునుగోడు, నకిరేకల్, దేవరకొండ, నల్లగొండ, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్టు,మోటకొండూరు, వలిగొండ, ఆత్మకూర్, మోత్కుర్, గుండాల, సూర్యాపేట జిల్లాలో అయితే తుంగతుర్తి, తిరుమలగిరి ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు.
పత్తి పంటపై లద్దెపురుగు దాడి
జిల్లాలో అత్యధికంగా పత్తి పంటకు అనుకూలమైన భూములు ఉండడంతో ప్రతిఏడాది జిల్లాలో పత్తి సాగు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.ఈసారి కూడా గతానికి కంటే అధికంగానే సాగు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.అయితే కంటికి రెప్పలా కాపాడుతున్న పత్తి సాగుపై ఆకులను, కాయలను తినే లద్దెపురుగు దాడి చేస్తుంది.ఆ పురుగు పత్తి పంటపై దాడి చేసి గూడలను, కాయలను తినేస్తుంది.అంతేగాకుండా ఆకులను కూడా తినడం వల్ల పత్రహరితం ఉండదు.దీంతో మొక్క పెరుగుదల నిలిచిపోతుంది.ఈ పురుగు ఎక్కువగా రాత్రివేళనే దాడి చేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.అందులో ప్రధానంగా లేతచేనుపై ఎక్కువగా పురుగు వాలిపోతుంది.
పంట దిగుబడిపై ప్రభావం
సహజంగా పత్తి పంట ఎలాంటి క్రిమీకీటకాల బారిన పడకుండా ఉంటే ఎకరాకు దాదాపు 8నుంచి10క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ క్రిమీకిటకాలు ఆవరిస్తే పంట దిగుబడి 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.దిగుబడి వచ్చిన పత్తి కూడా నాణ్యతగా లేదని మార్కెట్లో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురిచేస్తుంటారు.అయితే ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్‌కు సుమారు రూ.12వేలు ధర ఉంది.అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగానే ఉంది.ఇలాంటి సమయంలో పత్తి దిగుబడి తక్కువగా వస్తే రైతుకు ఆర్ధికంగా తీవ్రనష్టం వస్తుంది.
పురుగు నివారణకు ...
మొక్క ఎదుగుదల, కాయలు వచ్చే సమయంలో వాటిని లద్దెపురుగు తినేయకుండా ఉండేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పురుగుమందులు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.ఇమోమెక్టిన్ బెంజోమేట్ 100గ్రా. ఎకరాకు, ప్లూబెండమైడ్ 100మి.లీ. ఎకరాకు, క్లోరాంథ్రినిప్రోల్ 60 మి.లీ. ఎకరాకు, అనే మూడరకాల పురుగు మందుల్లో ఏదైనా పిచికారీ చేసిన పురుగులను నివారించే అవకాశం ఉంది.అయితే ఈ పురుగుమందును చేనుకు సాయంత్రం వేళ మాత్రమే పిచికారీ చేయాలి.అలా చేయడం వల్ల పత్తి చేనుపై వాలే పురుగును నివారించడానికి అవకాశం ఉంది.
ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు
మర్లపాడు నర్సింహ, రైతు, గ్రామం. మర్లపాడు, వలిగొండ మండలం
పత్తిచేనుపై ఆకుపచ్చ పురుగు వాలుతుంది.ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉంటలేదు. ఆకు లను, గూడలను, కాయలను తినేస్తుంది.అది తినడం వల్ల చేను ఎదుగుదల ఉంటలేదు. అట్ల లేకపోతే పంట అనుకున్నట్టు ఉండదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవచ్చు.