Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలను ఐక్యంగా చర్చించడానికి మహాసభలు
- సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలి
- కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ
నవతెలంగాణ-రామన్నపేట
కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ అన్నారు.ఆదివారం మండలకేంద్రంలోని అమృతవనంలో మండల కల్లుగీత కార్మిక సంఘం మహాసభను నాయకులు పులిభిక్షం అధ్యక్షత నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్19, 20వ తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అక్టోబర్ 19 న ప్రారంభ సభ, 20న కేజీకేఎస్ రాష్ట్ర మూడో బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. మహాసభకు వేలాదిమంది గీత కార్మికుల స్వచ్ఛందంగా కదిలిరావాలని కోరారు.రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నిత్యం అధ్యయనం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తు న్నామన్నారు. మహాసభలలో గత మహాసభ నుండి ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలను ఆందోళనలను సమీక్షించుకొని ఇప్పటి పరిస్థితులలో గీతకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను మహాసభలలో నిర్ణయిస్తామన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలరాజుగౌడ్ మాట్లాడుతూ 1957లో ఏర్పడిన సంఘం అప్పటినుండి ఇప్పటివరకు కల్లుగీత కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ అనేక సమస్యలను పరిష్కరించిందని, భవిష్యత్లో కార్మికుల సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమిస్తుందని కార్మికులంతా కలిసికట్టుగా కదలిరావాలని కోరారు.
నూతన మండల కమిటీ ఎన్నిక....
కల్లుగీత కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవాధ్యక్షులుగా పబ్బతి లింగయ్య, అధ్యక్షులుగా ఎర్ర రవీందర్, ఉపాధ్యక్షులు కునూరు మల్లేశం, గంగాదేవి అంజయ్య, పణసం కనకయ్య, జహంగీర్, ప్రధాన కార్యదర్శిగా పులిబిక్షం, సహాయ కార్యదర్శి పబ్బు శేఖర్, పబ్బతి ఆంజనేయులు, పబ్బు గంగాధర్, గుండాల శేఖర్, కోశాధికారి మునికుంట్ల లెనిన్, సోషల్ మీడియా కన్వీనర్ గా బైరు రామకృష్ణగౌడ్, కునూరు గణేష్, ఆకిటి శ్రీను లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగొని జయరాములు, నాయకులు భావండ్లపల్లి బాలరాజు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.