Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ గాదె రమేష్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలోనే హామీ ఇచ్చిన అవి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. చాలీచాలని వేతనాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అలాంటి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి విడనాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారే తప్ప ఏ ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. గత కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల్ల స్థలాలను కేటాయించాలని తీర్పు చెప్పారని గుర్తు చేశారు. అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.కె ఆయుబ్, బాధిని నరసింహలు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో 50 శాతం ఫీజులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, అదేవిధంగా దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకంలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. లేనిపక్షంలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డీపీఆర్వోను పిలిపించి ప్రయివేట్ విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లల ఫీజులలో రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జాజాల కృష్ణ, ఎం రాంప్రసాద్, ఎన్.సంజీవకుమార్, రవీందర్రెడ్డి, ఉపేంద్ర, స్వామిగౌడ్, నరేష్, ఏం సైదులు, జయరాజు, అరుణ్ బాబు, సాగర్, నాగేందర్, శ్యామ్, హరీష్, సైదులు, ఇబ్రహీం, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.