Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికుల జిల్లా జనరల్ బాడీ సమావేశం నూకల జలంధర్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న రంగాలలో రవాణా రంగం ప్రధానమని తెలిపారు. ఇంత కీలకమైన రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం భద్రత లేని బతుకులు, చాలీచాలని వేతనాలతో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ, జీపు, కారు, ఆటో, ప్రైవేట్ స్కూల్ బస్, అంబులెన్స్, హార్వెస్టర్, రోలర్, హిటాచి తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ, బ్యాంకు రుణాల లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన మోటార్ వాహన చట్టం పేరుతో ట్రాన్స్పోర్ట్ కార్మికుల పైన చాలాన్లు, పైన్స్ పేరుతో విపరీతమైన భారాలు మోపుతున్నారన్నారు. వీటితోపాటు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు రవాణా రంగ కార్మికుల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయని తెలిపారు. పోలీసు, ఆర్టీవోల వేధింపులు ఎక్కువయ్యాయని, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులు కార్మికులను వేధిస్తున్నారని, ఈ సమస్యలపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వంగూరు వెంకన్న, దాసరి శివకుమార్, సతీష్, కంచర్ల సాగర్‌రెడ్డి, మంద సామెల్, ఎస్కే జానీ, తదితరులు పాల్గొన్నారు.