Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండుతున్న వరి పొలాలు
- ఆయోమయంలో రైతులు
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
నాగార్జునసాగర్ ఎడమకాలువకు గండిపడడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.ఈనెల 7న వేంపాడు వద్ద కాలువకు గండి పడింది. నాగార్జునసాగర్‌లో నీటినిలువ పుష్కలంగా ఉండడంతో రెండుపంటలు సాగు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు భావించారు.కానీ ఇంతలోనే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాల్వకు గండిపడింది.ఇప్పటికే కాల్వ కింద సుమారు 90శాతం వరి పంట సాగైంది. అందులో కొంత వరి పచ్చటి పైరుగా ఎదుగుతుండగా, మరికొంత చేను పొట్టదశకు చేరుకుంది.ఇప్పటికే పదిరోజులుగా పంటపొలాలకు నీరందకపోవడంతో పంటలన్ని ఎండుతున్నాయి. బోరు బావుల కింద ఉన్న పొలాలకు నీరందించాలనకుంటే విద్యుత్ కూడా సరిగ్గా ఉండడం లేదు. ఐదు గంటలు విద్యుత్ ఇచ్చి బంద్ చేస్తారు. ఆ తర్వాత సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే ఎవరూ సమాధానం చెప్పరని కాలువ కింద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన కాల్వ పనులు
ఎన్నెస్పీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 12 రోజుల కింద సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది.దాని కారణంగా సమీప ప్రాంతంలోని గ్రామాలలో వరద దాటికి ఇసుక మేటలు పెరిగిపోయాయి.వేలాది ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వాటిని ఇప్పటివరకు తొలగించిన దిక్కులేదు. రేయింబవళ్లు పనిచేసి కాల్వ పనులు పూర్తి చేయాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.ఆడుతూ పాడుతూ పనులు చేసినట్లుగా అధికారులు వ్యవహరశైలి కనిపిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇపుడు జరుగుతున్న పనులతీరును బట్టి చూస్తే మరో పది రోజుల వరకు కూడా కాలువ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు.ఒకవేళ అదే జరిగితే పంటలు పూర్తి నష్టపోయినట్టేనని అన్నదాతలు ఆవేదనతో ఉన్నారు.
3.20లక్షల ఎకరాల వరి పంటకు నష్టం ..
సాగర్ ఎడమకాలువకు ఈనెల 7న గండిపడింది.దీంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు.దాంతో పంటకు నీరందే పరిస్థితిలేదు. కాలువ నీటిపైనే ఆధారపడిన వరిపంటలు ఎండి పోతున్నాయి.సాగర్ ఎడమకాలువ కింద సుమారు 3లక్షల ఎకరాలకుపైగా వరి సాగవుతుంది. నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో మొత్తం వరి పంటకు నీరందే పరిస్థితి లేదు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నిడమనూర్, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల,పాలకవీడు, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడలతో పాటుగా ఖమ్మం జిల్లాలలో కూడా సాగర్ కాలువకు నీరందక పంటలు ఎండిపోతున్నట్టు తెలుస్తుంది.ఉమ్మడి జిల్లాలో సుమారు 2.20లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 1లక్ష ఎకరాల వరకు సాగర్ఎడమ కాలువ నీటిద్వారానే పంటలు సాగవుతున్నట్టు రైతుసంఘం నాయకులు పేర్కొంటున్నారు.
నామమాత్రంగా నష్టంపై విచారణ
కాలువకు గండిపడడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో కూడా అధికారులు నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తుంది.నిడమనూర్, నర్సింహులగూడెం గ్రామంలో దాదాపు 48 ఇండ్లలో నాలుగు ఫీట్ల లోతు వరకు నీరునిలిచి ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తులు పూర్తిగా నష్టం వాటిల్లింది.అయితే రెవెన్యూ అధికారులు నివేదిక ప్రభుత్వానికి పంపిస్తాం..ఏదైనా పరిహారం వస్తే ఇస్తాం.. మా చేతుల్లో ఏంలేదు అన్నట్టుగా బాదితులకు చెప్పి చేతులు దులుపుకున్నారు.వరదతో సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం జరిగిందని అధికారులకు సంబందిత వివరాలను పంపిస్తున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.కానీ వాస్తవంలోకి చూస్తే వందలఎకరాల పంట వరద కారణంగా నష్టం జరిగిందని రైతులు పేర్కొంటున్నారు.మొత్తంగా అధికారులు తూతూమంత్రంగా విచారణ చేశారని స్థానికులు పేర్కొంటున్నారు.
కాలువ పనులు పూర్తికాక అయోమయం
నన్నెబోయిన సత్యనారాయణ రైతు, వల్లాభాపురం, నిడమనూర్ మండలం పదిరోజుల నుంచి నీళ్లు లేక పొలాలు ఎండిపోయే దశకు వచ్చాయి.నేను 8 ఎకరాలలో వరిసాగు చేశాను.ఇప్పటికే పెట్టుబడి కింద సుమారు రూ.50వేలకు పైగానే వెచ్చించా.కానీ కాలువ పని ఇంకా పూర్తికాక మా పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంకా ఆలస్యమైతే వరిపంట పొలాలు చేతికి దక్కవు.