Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సెప్టెంబర్ 7 న కురిసిన వర్షాలతో వేంపాడు వద్ద గండి పడిందని, ఈ గండిని పూడ్చడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన రైతు సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనతో పాటు రైతు సంఘం ప్రతినిధి బందం సందర్శించి నష్టాల వివరాలను తెలుసుకోని ప్రభుత్వ అధికారులకు తెలియజేశామని, వెంటనే గండిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నేటికి నేర్చవేర్చలేదన్నారు. ఆ నిర్లక్ష్యంతోనే నిరంతరం కాల్వపై పర్యవేక్షణ లేకపోవడం వలనే ఈ గండి పడిందని గుర్తు చేశారు. గండి పడడంతో వందలాది ఎకరాల వరిపంట కొట్టుకుపోయి, పొలాలల్లో రాళ్లు, ఇసుక మేటలు పెట్టినాయని, వ్యయ ప్రయాసలకు ఓర్చి వ్యవసాయం చేస్తే అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలువకు గండి పడి వందలాది ఎకరాలు పంట నష్టపోయారన్నారు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చేసిన నాసిరకం పనులు, అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సకాలంలో నీటి రైతులకు అందించాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.సకాలంలో గండి మరమ్మతులు చేయకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, జిల్లా కార్యదర్శి కున్రెడ్డి నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు బండా శ్రీశైలం, కందాల ప్రమీల, అయితరాజు నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.