Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చింతపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మాయాజాలం
- ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి మామూళ్లు తీసుకున్నట్టు సర్వత్రా విమర్శలు
- అక్రమకేసులు పెట్టిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్న తహసీల్దార్
- తమకు న్యాయం చేయాలంటున్న బాధితరైతులు
నవతెలంగాణ-చింతపల్లి
'అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని' అన్న చందంగా మారింది చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం.తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు,అవినీతికి అడ్డాగా మారిందని చెప్పొచ్చు.మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన పడకండి నారయ్య, పడకంటి చెన్నయ్య, పడకంటి బక్కయ్యతో పాటు మరికొంతమంది రైతులు 60 ఏండ్లుగా సర్వేనెంబర్ 224,225లో అసైన్డ్భూములను సేద్యం చేసు కుంటున్నారు.ఆ భూములపై కన్నేసిన కొంతమంది సాగు చేసుకుంటున్న రైతులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది.సాగు చేసుకుంటున్న రైతులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ప్రయివేట్ వ్యక్తులకు, రియల్టర్లకు కొమ్ముగాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రైతుల భూముల పక్కన నక్ష బాట ఉండగా అక్కడి నుండే ట్రాక్టర్లు, లారీలు, ఇతరత్రా పెద్దపెద్దవాహనాలు వెళ్లేవి.కానీ ఆ బాటను రద్దు చేసి రైతులభూముల్లోంచి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బొక్కల ఫ్యాక్టరీ కోసం 50 ఫీట్ల దారిని తహసీల్దార్ తీయించినట్టు సమాచారం.ఇందుకు గాను సంబంధిత అధికారి ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి పెద్దమొత్తం మామూళ్లు తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.మామూళ్లు తీసుకున్నందునే సదరు అధికారి దగ్గరుండి జేసీబీతో రైతుల భూముల్లోంచి దారి తీయించినట్టుగా తెలిసింది.రైతుల భూముల్లోంచి 50 ఫీట్ల రోడ్డును వేయించే అవసరం తహసీల్దార్‌కు ఏముందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.వందల ఏండ్ల నుండి ఉన్న బాటను తొలగించి కొంతమంది రైతుల భూముల పక్క నుండి 50 ఫీట్ల రోడ్డు వేయడం సరికాదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నోమార్లు ఎంక్వయిరీ చేయించి ఇది నక్ష బాట కాదని రాసిచ్చిన తహసీల్దార్ ఇక్కడి నుండే రోడ్డు వేసుకోవాలని ప్రయివేట్ కంపెనీ కోసం మాటమార్చడం ఏంటని వాపోతున్నారు.ఈ విషయమై ప్రభుత్వభూమిలో నుండి ప్రయివేట్ కంపెనీ కోసం రోడ్డువేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టర్‌కు ఎన్నోమార్లు వినతిపత్రాలు ఇచ్చినా తమకు న్యాయం జరగలేదని బాధితరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం స్పందించి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బొక్కల ఫ్యాక్టరీకి రోడ్డు ఇవ్వకుండా తన భూములను కాపాడాలని రైతులు కోరుతున్నారు.అధికారులు స్పందించకపోతే తామంతా ఆత్మహత్యకైనా పాల్పడ్తామని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.