Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
దేశానికి, రాష్ట్రానికి శనిలా దాపురించిన కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల కారణంగా ఒక్కో పౌరుడిపై రూ.2.25 లక్షల భారం మోపారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో' యాత్రకు సంఘీభావంగా మండలంలో బీర్ల అయిలయ్య చేస్తున్న పాదయాత్ర మంగళవారం మూడో రోజుకు చేరుకుంది.పాదయాత్ర సైదాపురం, మాసాయిపేట, మల్లాపురం గ్రామాల్లో కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్నిస్తే కేసీఆర్ అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ తన కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారుమయం చేసుకుని రాష్ట్ర ప్రజల బతుకులను మాత్రం అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై యుద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ నటిస్తున్నారని, మోదీ, కేసీఆర్ లోపాయీకారి ఒప్పందంలో భాగంగానే ఈ తతంగమంతా నడుస్తోందని విమర్శించారు.కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ తపాస్‌పల్లి నీరు ఆలేరుకు అందించాలని కోరారు.8 ఏండ్ల మోడీ పాలనలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని విమర్శించారు.అదానీ, అంబానీ వంటి బడా ప్రారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని మొత్తం ప్రైవేటుపరం చేయాలని మోడీ కుట్ర పన్నారని ఆరోపించారు.ఆయన అనాలోచిత నిర్ణయాలతో జీఎస్టీ రూపంలో పేదప్రజలు కూడా పన్నులు చెల్లించాల్సి వస్తోందన్నారు.ఆలేరు నియోజకవర్గానికి దక్కాల్సిన తపాసుపల్లి నీళ్లను మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటకు తరలించుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా మంగళహారతులు పట్టి సాగనంపారని ఎద్దేవా చేశారు.బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆలేరు సహా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, వైస్‌ఎంపీపీ ననబోలు ప్రసన్న శ్రీనివాస్‌రెడ్డి, మండలఅధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకుబ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఎలేందర్‌రెడ్డి, సర్పంచ్ బీర్లశంకర్, ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్‌రెడ్డి, నాయకులు గుండు నర్సింహ, గుడ్ల నరేష్, బూడిద భాస్కర్ పాల్గొన్నారు.