Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
పత్తి ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సన్న, చిన్న కారు రైతులకు సామాన్య భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం డిండి మండలంలోని గోనకొల్లు గ్రామంలో పత్తి ఉత్పాదన పై ఏఐటీయూసీ, ఐఎల్ఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో పత్తి ముఖ్య వాణిజ్య పంటగా మారిందన్నారు. ప్రపంచంలో పత్తి ఉత్పత్తి భారత దేశంలోనే 25 శాతం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో సుమారు 6 కోట్ల మంది రైతులు, 10 కోట్ల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. సన్న, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఏఐటియుసి ఎంతో కృషి చేస్తుందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ, పురుష జీతాల వ్యత్యాసం నివారణ కోసం ఎఐటియుసి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు హుస్సేన్, బుష్పక లింగమయ్య, శైలేష్, ఏసోబు, నిరంజనమ్మ, పద్మ, లింగమ్మ, ఏఐఎస్ఎఫ్ డివిజన్ నాయకులు వినరు తదితరులు పాల్గొన్నారు.