Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22న జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
- విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతులకు పంట గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. పంటలకు సరైన గితుబాటు ధర అందించేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని దానికోసం రైతాంగం బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అసలే పెట్టిన పెట్టుబడి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడం మరింత భారంగా మారుతుందని వాపోయారు. ఆ ఆలోచనలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వాలు ఇతర దేశాల నుండి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం సరైనది కాదన్నారు. ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో నెట్టి వేయబడిందని, దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందన్నారు. రైతన్న వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 22న మిర్యాలగూడలో రైతు సంఘం జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని రామచంద్ర గూడెం వద్ద ఉన్న ఎస్ఆర్ఆర్ గార్డెన్లో ఈ మహాసభ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ హాజరవుతున్నట్టు తెలిపారు. జిల్లా నలుమూల నుండి రైతు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు పిల్లుట్ల సైదులు, చాంద్ భారు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.