Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
రైతులను విస్మరిస్తే ప్రభుత్వాలకు పతనం తప్పదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, వ్యవసాయ రంగం తప్ప మిగిలిన అన్ని రంగాలు ప్రైవేట్ పరం అయ్యాయని, భూమిని నమ్ముకున్న రైతు లాభాలు వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయ మాత్రమే చేస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందడం లేదని, రైతులు గిట్టుబాటు ధర కొరకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కొరకు13 నెలలపాటు ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వంపై పోరాడి విజయం సాధించిన తీరు దేశ రైతాంగానికి ఆదర్శమని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనన్నారు. వరిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపట్ల రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయిందన్నారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వాలను ఐక్యంగా రైతులు పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం నూతనమండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పల్ రెడ్డి సత్యనారాయణరెడ్డి, కార్యదర్శిగా నల్లబోతు సోమయ్య ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి కోటేష్, రైతు సంఘం నాయకులు కోమండ్ల గురవయ్య, కోతి ఇంద్రారెడ్డి, కత్తి లింగారెడ్డి తదితులున్నారు.