Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఈ మూడు తప్పనిసరి. కానీ అందులో మనిషి తలదాచుకునేందకు అవసరమైన గూడు చాలా అవసరం. ఇంటి జాగ కోసం చాలా కాలంగా ప్రజా సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించాయి. పాలకులు ప్రతి ఎన్నికలలో పేదలు ఇళ్లు నిర్మించి ఇస్తాం, జాగ ఉన్న వాళ్లకు నిర్మాణం కోసం ఆర్ధిక సాయం చేస్తామని అనేక హామీలు ఇచ్చారు. కానీ ఆ మాటలు నేడు నీటిమీద రాతలుగా మిగిలాయి. పేదల కోసం ఇండ్ల నిర్మాణం చేశామని చెపుతున్నా... అవి ప్రస్తుతం బూతు బంగ్లాలుగా మారిపోయాయనే విమర్శలొస్తున్నాయి... ఇలాంటి పరిస్థితిలో పేదలకు గూడు సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలనే డిమాండ్‌తో నేడు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లా కలెక్టరేట్లను పేదలు ముట్టడించనున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండజిల్లాలోని పేదలకు ఇంటి స్థలం, స్థలం ఉంటే నిర్మాణం కోసం ఆర్ధిక సాయం, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగాలనే డిమాండ్‌తో ప్రజా సంఘాలు వ్యకాస, సిఐటీయూ, కెవిపిఎస్, రైతు, గిరిజన, ఐద్వా , వృత్తి సంఘాల ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాలలో ఇప్పటికే పేదలు ప్రభుత్వ
స్థలాలలో గుడిసెలు వేసుకుని ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఇంటి స్థలంలేని పేదలు 142 సర్వే నెంబర్ స్థలంలో గుడిసెలు వేసుకుని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్యర్యంలో పెద్దఎత్తున పోరాటం చేశారు. నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామంలో 129 సర్వే నెంబర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు నాటారు. నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గ్రామంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకుంటే ఒర్వలేని పాలకుల తొత్తులైన అధికారులు వాటిని తొలగించారని తెలిసింది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలో నిర్మాణం చేసిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయకపోతే వారే స్వాదీనం చేసుకుంటారని గతంలోనే ప్రజా సంఘాలు ప్రభుత్వాని హెచ్చరించినప్పటికి స్పందించలేదు.. అందుకే వాటిని ఇళ్లు లేని పేదలు స్వాదీనం చేసుకున్న ఘటనలు కూడ జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సింగన్న గూడెంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు, నల్లగొండలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు బూతు బంగ్లా మాదిరిగా మారిపోయాయని వాటిని వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఇలాంటి ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేకం ఉన్నాయి.
పాలకులిచ్చిన హామీలు నేరవేర్చాలని...
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు పేదలందరికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, సూర్యపేట పట్టణంలో తప్ప ఎక్కడ కూడ పంపిణీ చేయలేదు. కొన్ని ప్రాంతాలలో నిర్మాణం చేసి పంపిణీ చేయలేదు. అందుకే వాటిని వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటిస్థలం కలిగిన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం అసేంబ్లీసాక్షిగా ప్రకటన చేసిందే కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడ ఇవ్వలేదు. అందుకే వెంటనే ఇంటి జాగ లేని పేదలకు 120గజాల స్థలం ఇచ్చి, నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేసే చర్యలను చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన రెండు పడకల గదుల ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని, అసంపూర్తిగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సంఘాలకు అతీతంగా పేదలు తరలిరావాలి : నారి అయిలయ్య, వ్యకాస జిల్లా కార్యదర్శి
ఇళ్లు, ఇంటి స్థలం, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీ చేయాలని డిమాండ్‌తో జరగనున్న కలెక్టరేట్ ముట్టడికి అన్ని వర్గాలలో ఉన్న పేదలంతా పెద్దఎత్తున తరలిరావాలి. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.