Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
చండూరు మండలంలో ఓవర్ లోడ్ మట్టి టిప్పర్లతో రోడ్లన్నీ అధ్వానంగా తయారవుతున్నాయి. గత మూడు నెలల పైగా మండలంలోని ఇడికూడా గ్రామంలోని చర్ల మట్టిని కొందరు కాంట్రాక్టర్లు, చర్లగూడెం చెరువుకు ఓవర్‌లోడ్ టిప్పర్ల ద్వారా ఆ గ్రామం నుండి బంగారిగడ్డ, దోనిపాముల, లెంకలపల్లి గ్రామాల మీదుగా రోజు మట్టిని తరలిస్తున్నారు. దీంతో గ్రామాల మీద నుండి వెళ్తున్న టిప్పర్లతో రోడ్లన్నీ గుంతలుగా ఏర్పడి, డాంబర్, కంకర తేలి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో రోడ్లపైన ఎక్కడో ఒకచోట వాహనాలు అదుపుతప్పి పగలు, రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మండలంలోని దోనిపాముల గ్రామంలో సాయంకాలంలో గ్రామపంచాయతీ కార్మికుడు దాసరి కృష్ణయ్య కాలనీలోకి నల్లాలు విడుదల చేయడానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు పైన ఉన్న గుంతలో పడి గాయాలయ్యాయి. దీంతో బంగారుగడ్డ, ఇడికూడా, దోనిపాముల గ్రామాల ప్రజలు అధికారులకు చెప్పిన కూడా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమత మవుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఇళ్ల యజమానులు నిత్యం శబ్దాన్ని భరించలేక పోతున్నామని చెప్పుకొచ్చారు. ఇది ఏమైనా అధికారులు వెంటనే స్పందించి ఓవర్ లోడులతో వెళ్తున్న టిప్పర్ల మట్టిని నిలిపి వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మట్టికి పర్మిషన్ ఉందా లేదా తహశీల్దార్‌ను వివరణ అడగగా ఆర్ఐని పంపించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటానని చెప్పారు.
రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి
- గాదె పాక చంద్రయ్య (ధోనిపాముల)
గత మూడు నెలల నుండి ఓవర్ లోడ్ మట్టి టిప్పర్లతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. రోడ్లపైనే మట్టి పేడ్డలు పడుతున్నాయి. కాంట్రాక్టు ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, అమర్యాదగా మాట్లాడుతున్నారు. బైక్ పై వెళ్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
గుంతలో జారిపడ్డ..
-దాసరి కృష్ణయ్య (పంచాయతీ కార్మికుడు, ధోనిపాముల)
గ్రామంలో నల్లా నీరు విడుదల చేయడానికి లూనా పై వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న గుంతలోకి జారి కింద పడ్డా. దీంతో మోకాలికి, చేతికి గాయాలు అయ్యాయి. ఇలా రోడ్లపై గుంతలు పడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.