Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా
మంత్రి జగదీశ్‌రెడ్డి
- ధూంధాంగా టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాలు
నవతెలంగాణ-నాంపల్లి
ఫ్లోరోసిస్ విముక్తి కోసం మిషన్ భగీరథను తీసుకొచ్చి ప్రతీ ఇంటికి మంచినీరు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వనభోజనాల కార్యక్రమాన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో ధూంధాంగా నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు డప్పు చప్పుల్లతో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో వివక్షకు గురై అభివృద్ధిలో వెనకబడిందన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర వెనుకపాటును గుర్తించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆనాటి నుండి తెలంగాణ ప్రాంతంలోని గ్రామ గ్రామం తిరిగి ఈ ప్రాంత సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన తర్వాత ఆయన ఈ ప్రాంతంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ విముక్తి కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం కూడా జరుగుతుందని, ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో అమ్మాయి తల్లిదండ్రులకు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సాయం టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత ఎన్నికలలో ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచి ఇటీవల కాంట్రాక్టుల కోసం పదవికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి, ఈ ప్రాంత సమస్యల గురించి ఏ రోజు పట్టించుకోలేదని, ఆయన గెలిచిన రోజు నుండి సొంత పనుల కోసం ఇతర రాష్ట్రాలకు పరుగులు తీశారు తప్ప ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదన్నారు. తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలను మోసం చేసి కాంట్రాక్టుల కోసం బిజెపి పెద్దల వద్ద నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే ఇప్పుడు గుజరాత్లో అక్కడి ప్రభుత్వం రైతులకు ఇస్తున్నట్లుగా 6 గంటల విద్యుత్తు ఇస్తారని దానికి కూడా కరెంటు మీటర్లు బిగించి బలవంతంగా నైనా బిల్లులు వసూలు చేస్తారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది 2014 నుండి 2018 వరకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ శాసనసభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్‌నాయక్, శాసనమండలి సభ్యులు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఏంసి కోటిరెడ్డి, మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాంపల్లి ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి, జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏడు దొడ్ల ప్రభాకర్ రెడ్డి, ఇట్టం వెంకటరెడ్డి, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.