Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో లేదంటే తగిన మూల్యం తప్పదని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తమ స్వప్రయోజనాల కోసం అమ్ముడుపోయే, కొనుగోలు చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీనే అని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌కి తగిన గుణపాఠం చెపుతారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టు అగ్ర నాయకులు అమ్ముడుపోయారని అనడం సరికాదని, కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఎవరు అడ్డంగా దొరికారు కాంగ్రెస్ ఒకసారి గుర్తుకు చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మునుగోడు దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలు రావటం కాంగ్రెస్ పుణ్యమేనని, దుబ్బాక హుజురాబాద్ ఎన్నికలలో బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. పూటకో పార్టీ మారే నువ్వు కమ్యూనిస్టుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం నిరంతరం పోరాటం కొనసాగించేది కమ్యూనిస్టులేనని, కమ్యూనిస్టుల గత చరిత్రను తెలుసుకొని మాట్లాడితే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ సీపీఐ(ఎం)మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, మైల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.