Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ అమలు చేయాలి
- 2016 వేతనాల పెంపు జీవో అమలు చేయాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములు
నవతెలంగాణ-మోత్కూరు
నవంబర్ 12, 13 తేదీల్లో మోత్కూర్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండో మహాసభలను నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు తెలిపారు. మున్సిపాలిటీల్లో రద్దు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేసి కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండో మహాసభల విజయవంతం కోసం మంగళవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లుయాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందికి పైగా కూలీ పనులు చేసుకుని జీవించే కూలీలు ఉన్నారని, రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాలు చాలీచాలని జీతాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్నఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసే ఆలోచన చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంతో కూలీ కుటుంబాలు పనులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, నిత్యావసర ధరల పెరుగుదలతో కూలీ గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నారని, 2016కు సంబంధించిన వేతన జీవో అమలు చేసి కనీస కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 20 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేవని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను బీజేపీ ప్రభుత్వం ఇష్టారీతిన పెంచుతుందని, గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సబ్సిడీపై వంట గ్యాస్ అందించాలని, రేషన్ దుకాణాల ద్వారా 17 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 12, 13 తేదీల్లో మోత్కూరులో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఉపాధ్యక్షులు జెల్లెల పెంటయ్య, సల్లూరి కుమార్, సహాయ కార్యదర్శులు రాచకొండ రాములమ్మ, గంగదేవి సైదులు, చేనేత సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్, ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుంగపట్ల యాకయ్య, నాయకులు బొజ్జ బాలయ్య, మెతుకు అంజయ్య,టి.యాదయ్య ఎండి.జుబేద, గౌసియా, జి.భవాని, లక్ష్మీ, కలమ్మ, పద్మ, కళ్యాణి, సరిత, జోనమ్మ తదితరులు పాల్గొన్నారు.