Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ భర్త ఒంటెద్దు పోకడ
- అసంతప్తిలో కౌన్సిలర్లు
- డమ్మీలుగా మారామని బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆవేదన
- లెక్కేలేని కాంగ్రెస్ కౌన్సిలర్లు
- ఎమ్మెల్యేకు చెప్పుకోలేని స్థితిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీలో కోల్డ్‌వార్ నడుస్తోంది. మున్సిపల్ చైర్మెన్‌్ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం, ఆయన ఒంటెద్దు పోకడలతో కౌన్సిలర్లు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. పైకి మాత్రం అంతా సాఫీగానే కనిపిస్తున్నా చైర్మెన్ భర్త వ్యవహార శైలితో తమ ఇబ్బందులను కౌన్సిలర్లు తమ వారి వద్ద, విలేకరులతో అంతర్గత సంభాషణల్లో ఏకరువు పెడుతున్నారు. పేరుకు చైర్మెన్‌్ భార్య అయినా పెత్తనం మొత్తం భర్తే చెలాయిస్తుండటంతో మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు అధికారులకు ఏ చిన్న పనో, బోరు మోటార్ కాలిపోయిందనో చెప్పినా 'సార్' కు చెప్తేనే చేస్తామని చెబుతుండటంతో తమ పరిస్థితి వార్డు మెంబర్ల కన్నా అధ్వానంగా తయారయ్యిందని వాపోతున్నారు. కౌన్సిలర్లు ఏ పని చెప్పినా తనకు తెలియకుండా చేయవద్దని మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమను మాత్రం ఏ చిన్న పని కూడా చేయనివ్వడం లేదని, చైర్మెన్ భర్త మాత్రం అన్ని పనులు చేసుకుంటున్నారని, బిల్లుల ఆమోదానికే మూడు, నాలుగు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాలను ఛారు, బిస్కెట్ సమావేశాల్లా మార్చారని వాపోతున్నారు. కౌన్సిలర్లుగా ఎన్నికై మూడేళ్లు గడుస్తున్నా వార్డుల్లో ప్రజలు సంతప్తి చెందేలా పనులు చేయలేకపోతుండటంతో కౌన్సిలర్లుగా ప్రజలు తమను పట్టించుకోకపోవడంతో డమ్మీలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు చేసిన పనులకు కూడా తక్కువ బిల్లులు చేశారని, ఆ బిల్లులు కూడా ఏడెనిమిది నెలలకు గాని ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీలకు తెచ్చి చెల్లించాల్సి వచ్చిందని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్ల పరిస్థితే ఇలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ కౌన్సిలర్లంతా మహిళలుకావడంతో వారిని పట్టించుకునే దిక్కే లేదు. అంతా తానే అన్నట్టుగా చైర్మన్ భర్త వ్యవహరిస్తుండటంతో కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం వైపు కూడా వెళ్లడం లేదు.
కాంగ్రెస్ కౌన్సిలర్ భర్తతో చైర్మెన్‌్ భర్త ఘర్షణ
మున్సిపల్ కార్యాలయానికి ఓ పనిపై వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్తతో కొన్నాళ్ల క్రితం చైర్మెన్ భర్త తీవ్ర ఘర్షణ పడ్డారు. 'మా కౌన్సిలర్లే కార్యాలయానికి ఎక్కువగా రారు.. నువ్వేందయ్య ఎప్పుడు చూసినా ఇక్కడే కనిపిస్తావ్' అని చైర్మెన్ భర్త ప్రశ్నించడంతో చైర్మెన్ భర్తగా మీరెలా వస్తున్నారో కౌన్సిలర్ భర్తగా నేను కూడా అలానే వస్తున్నానని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర గొడవకు దారితీసింది. చైర్మెన్ భర్త, కౌన్సిలర్ భర్త గొడవ పడుతున్న విషయం తెలిసి విలేకరులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే సరికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ గొడవ సందర్భంగా కౌన్సిలర్ ను ఆరా తీయగా తమ వార్డులో మురికి కాల్వ తవ్వి మరమ్మతు చేయకుండా వదిలేసిన విషయమై కమిషనర్ దష్టికి తీసుకెళ్లానని, కౌన్సిలర్ గా నీ భార్య రాకుండా నువ్వేందుకు వచ్చావని అడిగితే చైర్మెన్ భర్తగా ఆయనెందుకు కార్యాలయంలో వచ్చి కూర్చుంటున్నారని ప్రశ్నించానని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు మహిళా కౌన్సిలర్లు గెలువగా ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. వార్డుల్లో సమస్యలను కమిషనర్ దష్టికి తీసుకెళితే ఆయన చైర్మెన్ భర్త అనుమతి లేకుండా ఏ పని చేయకపోవడం, చైర్మెన్‌్ భర్తకు చెబితే దురుసుగా సమాధానం చెబుతుండటంతో అడగడం కూడా మానేశామని, మహిళా కౌన్సిలర్లుగా కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ అసంతప్తి
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్ తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కౌన్సిలర్ గ్రామంలో కౌన్సిలర్‌ను కాదని మరో నాయకునికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తుండటంతో ఆమె తీవ్ర అసహనంతో ఉన్నారు. కౌన్సిలర్, ఆ నాయకుడు ఇద్దరూ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారే అయినప్పటికీ రెండు వర్గాలుగా విడిపోయి విభేదాలు తారాస్థాయికి చేరాయన్నది బహిరంగ రహస్యమే. తాను చెప్పిన పనులు చేయకుండా తన ప్రత్యర్థి నాయకుడు చెప్పిన పనులనే చేస్తుండటం, తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారని కౌన్సిలర్ లోలోన రగిలిపోతున్నారు. తిరిగి కాంగ్రెస్ కు వెళ్లడమా లేక కౌన్సిలర్ పదవికే రాజీనామా చేయాలా అన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేకు చెప్పుకోలేక మదన పడుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
అంతా తానే అన్నట్టుగా చైర్మన్ భర్త వ్యవహరిస్తుండటంతో అసంతప్తితో ఉన్న కౌన్సిలర్లు తమ పరిస్థితిని ఎమ్మెల్యేకు చెప్పుకోలేక మదన పడుతున్నారు. చైర్మెన్ భర్తకే ఎమ్మెల్యే ప్రాధాన్యతనిస్తుండటంతో అసంతప్తితో రగిలిపోతున్న కౌన్సిలర్లలో ఎవరూ సాహసించి ఎమ్మెల్యేకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కావడం.. ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా తమ పదవీకాలం ముగిసే సమయం దగ్గర వస్తుండటంతో ఇంకా తాము చేసేదేముంటుందని నిట్టూర్చుతున్నారు. ఇటీవలి కాలంలో వైన్ చైర్మెన్ వైఖరిలో కూడా మార్పు వచ్చిందని, ఆయన కూడా చైర్మెన్ భర్త తీరు పట్ల అసంతప్తితో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ కౌన్సిలర్ల సపోర్ట్ తీసుకుని అసంతప్తితో ఉన్న కౌన్సిలర్లు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే సహసమైతే చేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ నాయకులెవరైనా విషయాన్ని ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లి కౌన్సిలర్లతో మాట్లాడి వారికి ఏ విధమైన భరోసా ఇస్తారన్నది వేచి చూడాలి.