Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికి సమాన హక్కులు కల్పించాలి
- సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అది కేవలం కమ్యూనిస్టు దేశాలలో రుజువు అవుతుందని, కనీస వసతులు కల్పించడమే ఎర్ర జెండా లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ బాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 160 కోట్ల పైగా జనాభా ఉన్న దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని చెప్పారు. అక్కడ ప్రతి ఒక్కరికి ఉండటానికి ఇల్లు చేసుకోవడానికి పని, ఉచిత విద్య, వైద్యం అందించబడుతుందని, అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. వ్యక్తిగత సంక్షేమాలు కాకుండా విధానపరమైన సంక్షేమాలు అమలు చేయడం వల్ల దేశం అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. కానీ దేశంలో ప్రభుత్వ సంపదను, ఆస్తులను దోచుకునే పద్ధతిని పాలకుల అవలంబిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ బరితెగించి ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే నాయకుడు ఉండే విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగగొట్టిన కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని విమర్శించారు. బీజేపీ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందని, కార్మికులు, రైతులు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిస్తే ఊరుకోబోమని, కార్మికులు బలమైన ఉద్యమాలు చేసి ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిస్వార్థంగా సేవలందించే ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రాజకీయ నాయకులుగా మారారని, ఓటర్లు నిస్వార్ధంగా ఆలోచించి ప్రజాసేవ చేసే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కార్మికులు, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అంది ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీరెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచుకునేందుకు కార్మికులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గుర్తింపు కార్డులు, సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, భవనిర్మాణ కార్మికుల సంఘం జిల్లా నాయకులు బీఎం నాయుడు, సీఐటీయూ పట్టణ కన్వీనర్ తిరుపతి రామ్మూర్తి, రైతు సంఘం నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు పాపిరెడ్డి, యూనియన్ అధ్యక్షులు మందరాజు, కార్యదర్శి సైదులునాయక్, అలీమ్, నాగుల్ మీరా, పాశం గోవర్ధన్‌రెడ్డి, బుజ్జిబాబు, అంకెపాక నాగరాజు, సయ్యద్ హైమద్, నగేష్, గౌస్, సోముసుందర్, ఉట్లపల్లి సైదులు, కొటేష్ తదితరులు పాల్గొన్నారు.