Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతి పండక్కి జీతాలు ఇవ్వని వైనం
- ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ సిబ్బంది
- 67 మంది సిబ్బందికి నెలకు రూ.10.59 లక్షలు చెల్లింపు
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు జనవరి నెల కూడా ముగియడంతో మూడు నెలలుగా జీతాలు లేక సిబ్బంది తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండక్కి కూడా జీతాలు వేయకపోవడంతో పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులంతా జీతాలపై ఆధారపడి బతికే కుటుంబాలే కావడంతో ఇల్లు గడవడానికి కిరాణం షాపుల్లో, తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనవరి నెలతో మూడు నెలల జీతాలు...
ప్రస్తుతం జనవరి నెల కూడా ముగియడంతో నవంబర్, డిసెంబర్ తో కలుపుకుని మూడు నెలల జీతంలో కనీసం రెండు నెలల జీతం వేసినా కొంత చేయి తిరిగేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికులకు మున్సిపాలిటీలో చేసే పని తప్ప బయట వేరే పని చేసుకునే అవకాశం కూడా లేదు. ఉదయం 4 గంటలకు విధుల్లో చేరితే సాయంత్రం ఐదారింటికి కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితి. పూర్తిగా మున్సిపాలిటీ జీతంపైనే
ఆధారపడటంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని, కిరాణ షాపుల్లో రెండు నెలలుగా బాకీ
పెడుతుండటంతో ఉద్దెర కూడా ఇవ్వడం లేదంటున్నారు. మున్సిపల్ కేంద్రమైన మోత్కూరు, విలీన గ్రామాలు కొండగడప, బుజిలాపురం గ్రామాలను కలుపుకుని మొత్తం 67 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అందులో 65 మంది సిబ్బందికి రూ.15600 చొప్పున, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22750 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. నెలకు సిబ్బందికి రూ. 10 లక్షల 59500 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలకు రూ.31 లక్షల 78500 లక్షలు చెల్లించాల్సి ఉంది. జనవరి కూడా ముగిసినందున ఫిబ్రవరి మొదటి వారంలోనైనా కనీసం రెండు నెలల జీతాలైనా పడతాయా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు.
అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెట్టిన ప్రభుత్వం..
అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా సిబ్బందికి ప్రతినెలా పదో తేదీ వరకు జీతాలు చెల్లిస్తున్నారు. జీతాలను ఎక్కువగా ప్రతినెలా వచ్చే పట్టణ ప్రగతి నిధులు, సాధారణ నిధుల నుంచే చెల్లిస్తున్నారు. గతంలో పట్టణ ప్రగతి కింద రూ.10 లక్షల వరకు నిధులు రాగా ప్రస్తుతం ఆ నిధులను రూ.8 లక్షలకే కుదించారని చెబుతున్నారు. ఆస్తి పన్నులు, రెండేళ్లుగా పెండింగ్ ఉన్న నల్లా బిల్లులు కూడా ప్రస్తుతం సిబ్బంది ముమ్మరంగా వసూలు చేస్తున్నారు. నిధుల కొరత లేదని, ప్రభుత్వ ఆర్థికశాఖ అకౌంట్లను ఫ్రీజింగ్ లోపెట్టడంతోనే ఎలాంటి బిల్లులు పాస్ కావడం లేదని, రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితినెలకొందంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన జీతాల బిల్లులు చేసి చెక్కులను ఎస్టీవోలో జమ చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా కిరాణ షాపుల్లో నిత్యావసర సరుకులకు ఉద్దెర పెడుతున్నామని, జీతాలు ఇంకా ఆలస్యమవుతుండటంతో అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. జనవరి నెలకూడా ముగియడంతో నవంబర్, డిసెంబర్ నెలల జీతం ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.
రెండు నెలల జీతాల చెక్కులు ఎన్టీవోలో జమ చేశాం
- శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్, మోత్కూరు
సిబ్బంది నవంబర్, డిసెంబర్ నెలల జీతాల బిల్లులు చేసి చెక్కులను ఎస్టీవోలో జమ చేశాం. జీతాల చెల్లింపుకు నిధుల కొరత లేదు. ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజింగ్ చేయడంతో ఎలాంటి బిల్లులు పాస్ కావడం లేదు. ప్రభుత్వం అకౌంట్ల ఫ్రీజింగ్ తీసిన వెంటనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి.