Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
స్నేహిత కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎండీఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లతో జరిగిన రెండవ విడుత స్నేహిత అవగాహనా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. స్నేహిత మంచి కార్యక్రమమన్నారు. స్నేహిత ద్వారా బాలల సంరక్షణ పట్ల సామాజిక అవగాహన కలిగించడానికి చేపట్టిన కార్యక్రమాలను, స్నేహితను జిల్లాలో కొత్తగా ప్రారంభించిన కలెక్టర్ అభినందనీయులని అన్నారు. బాలల పట్ల సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయని, వాటిని అరికట్టేందుకు చట్టాలు వున్నాయని తెలియచేస్తూ అసలు రుగ్మతలే లేకుండా ముందస్తు నివారణకు గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, రిటైర్డ్ అధికారులతో బాలల పరిరక్షణ కమిటీల ద్వారా స్నేహిత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ స్నేహిత కార్యక్రమంలో ప్రజాపతినిధుల సహకారంతో క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీల ద్వారా అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడడమే స్నేహిత కార్యక్రమ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం, ఐసిడిఎస్, గామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల సమన్వయంతో అధికారులను మొత్తం 26 టీములుగా ఏర్పాటు చేసి గత జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మాసాలలో ప్రతి బుధవారం మొదటి విడుత స్నేహిత కార్యక్రమంలో మొత్తం 17 మండలాలలో 271 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 43 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. స్నేహిత రెండవ విడుత అవగాహనీ కార్యక్రమాలు ఈ మాసంలో ప్రారంభమవుతుందన్నారు. ఇందు కోసం 17 మండలాలలో 42 టీముల ఏర్పాటుతో 251 ప్యాథమిక పాఠశాలల లోని 17,058 మంది ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదివే బాలలకు ఐదు అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. అంతకుముందు స్నేహిత లొగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బిక్కు నాయక్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జెడ్పీ సీిఈఓ సిహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, సీడీపీఓ శైలజ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి సైదులు, తదితరులు పాల్గొన్నారు.