Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2023-24 బడ్జెట్లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి చౌగాని సీతారాములు, కొండ వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. సెంటు భూమి కూడా లేకుండా వత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న వారు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. ప్రమాదమని తెలిసి కూడా బ్రతుకుతెరువు కోసం వత్తిని చేస్తున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 550 మంది ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడ్డారు. వీరిలో 90 మంది చనిపోయి 460 మంది వికలాంగులయ్యారని, ఇంత ప్రమాదాలు ఏ వత్తిలో లేవన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గీత కార్మికులకు ఎలాంటి రుణ సౌకర్యం కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్రావు 100 కోట్లు కేటాయించామని చెప్పారు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. సభ్యులందరికీ ప్రమాద నివారణకు సేఫ్టీ మోకులు ఇచ్చి వత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు అందజేయాలని పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, గీతా కార్మికులు యాదయ్య, కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.