Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 నుండి 28వ తేదీ వరకు పాదయాత్ర
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ - భువనగిరి
ఏండ్ల తరబడిగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనగామ జిల్లా పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని రిటైర్డ్ టీచర్ భవనంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా విస్తత సమావేశం బందెల బిక్షం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. గ్రామపంచాయతీ కార్మికులుగా గ్రామాల్లో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా, కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా జీవో 60 అమలు చేసి కార్మికులకు ఇచ్చే 15000 ఇన్సూరెన్స్ పథకం ఎస్కేడి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని గ్రామపంచాయతీ కార్మికులకు అందరికీ ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న పాదయాత్రలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి, సియిటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దాసరి పాండు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ఈశ్వర్. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ. మాండ్ర శీను, మంద యాదగిరి, మైసయ్య, రాము, సలీం, ఐలయ్య, మనమ్మ, స్వామి, శ్రీశైలం, పరమేశు, శంకర్, పాల్గొన్నారు.