Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో తప్పిదాలు...
- ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
- పరిష్కారానికి కుస్తీ పడుతున్న అధికారులు
- నిలిచిపోయిన రెవెన్యూ సేవలు
భూముల వివరాలు పారదర్శకంగా ఉండాలని ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల కారణంగా ఆన్లైన్లో తప్పులుగా నమోదు కావడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వెబ్సైట్ ముందు పట్ట భూముల్లో ప్రభుత్వ భూమి ఉందని, కాలువలు వెళ్లాయని, వివాదాల్లో, కోర్టు కేసులు ఉన్న వాటిని కొన్ని సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పార్ట్-బీ కింద చేర్చారు. వ్యవసాయ భూములు నాలా కన్వెన్షన్ కింద పడిపోతే, మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉన్న, విస్తీర్ణంలో తేడా ఉన్న వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని సరి చేసుకునేందుకు టీఎం 33 కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఆ భూములు కొనుగోలు అమ్మకాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఉండిపోయాయి. ఎక్కడో ఒకచోట ప్రభుత్వ భూమి, కాలువలు ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేదితగా చూపించడంతో ఎక్కువ మంది రైతులపై ఆ ప్రభావం పడింది. అప్పటినుంచి రైతులు తప్పులను సరిదిద్దాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
గతంలో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసిన వెంటనే వీఆర్ఓ, ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదికను ఎమ్మార్వోకు అందించగా ఆ వెంటనే ఆర్డీఓ, కలెక్టర్ నివేదిక ఆధారంగా రికార్డులో సరి చేసేవారు. కానీ ధరణి వెబ్ సైట్లో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు ఆన్లైన్లో గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. దాని ఆధారంగా రెవెన్యూ అధికారులు నివేదిక తయారుచేసి తహసీల్దార్, ఆర్డీవో ద్వారా కలెక్టర్ లాగిన్‌కు పంపించేవారు. అక్కడి నుండి నేరుగా సీసీిఎల్కు వెళ్లగానే కలెక్టర్ లాగిన్‌లో దానిని అప్రూవల్ చేసేవారు. దీనికోసం 15 నుంచి నెలరోజుల సమయం పడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దానిని నెలలు, సంవత్సరాలు తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ అన్నదాతలు తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేలల్లో దరఖాస్తులు...కుస్తీ పడుతున్న అధికారులు
నిషేధిత జాబితాలో ఉన్న, భూముల సవరణ కింద ఉన్న, పేర్ల మార్పిడిలో జరిగిన తప్పిదాలను సవరించాలని వేలాల్లో దరఖాస్తులు వచ్చాయి. భూములు కొనుగోలు అమ్మకాలు చేసేందుకు ఆన్లైన్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నట్టు రైతులు గుర్తిస్తున్నారు. దీంతో జరిగిన తప్పిదాలను సరిచేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి కాలయాపన జరుగుతుంది. కొన్ని ఏండ్లుగా ఈ సమస్య తీవ్రతరమవుతుండడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దష్టికి రావడంతో ఆ జాబితాలో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో పరిష్కరించినవి కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో కేవలం నల్లగొండ జిల్లాలోని ఎనిమిది వేలపైగా ఉన్నాయని జిల్లా అధికారులు పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి సమయం పడుతుండడంతో అలా కాకుండా ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద తాసీల్దారులు, ఆర్ఐలు, సిబ్బంది ఒక దగ్గర కూర్చుని ధరణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. రోజుకు వెయ్యి దరఖాస్తులపైగా పరిష్కారం అవుతున్నాయని జిల్లా అధికారి ఒకరు నవతెలంగాణకు తెలిపారు. మరో వారం రోజుల్లో ధరణి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ల వద్ద కుస్తీలు పడుతున్నారు.
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామ పరిధిలో 80 సర్వే నెంబర్లు 110 ఎకరాల భూమి సుమారు 60 సంవత్సరాల నుండి పేద రైతులు సాగు చేసుకుంటున్నారు ..ప్రభుత్వం ఇచ్చి రైతులకుపట్టాదారి పాసుబుక్కు ఇప్పటికి ఇవ్వలేదు. రైతులకు వెంటనే పాసుబుక్కులు ఇవ్వాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేకసార్లు ఉద్యమాలు చేపట్టారు .అయినా అధికారులు మాత్రం రైతులకు పట్టదాని పాసుబుక్కులు.ఇవ్వడం లేదు. చింతపల్లి మండలంలోని నేల్వలపల్లి గ్రామానికి చెందిన అంగిరేకుల నాగభూషణ్ మాజీ సర్పంచ్ తనకున్న 20 ఎకరాల భూమి ధరణి వచ్చిన తర్వాత తన భూమి సెమీ అర్బన్ అనే ఆప్షన్ లో పడిందని, ఎన్నోసార్లు సీసీఎల్ఏ కు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. రామన్నపేట మండలంలో అసైన్మెంట్ భూములలో పట్టాదారు చనిపోతే వారి వారసులకు పౌతి చేయాల్సి ఉండగా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. కొందరికి పౌతి కావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే సమస్య నెలకొంది.
గోప్యంగా ఉంచుతున్న ధరణి వివరాలు
ధరణి వివరాలను అధికారులు గత కొంతకాలంగా గోప్యంగా ఉంచుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోగా వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ దరఖాస్తులు వేల సంఖ్యలో చేరుకోవడంతో వాటిని పరిష్కరించేందుకు కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు వరకు జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి...వాటిలో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు...ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయానికి సమాధానం చెప్పకుండా అధికారులు దాటవేస్తున్నారు. మండలాల వారిగా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులు వస్తాయని, వాటి వివరాలు మా దగ్గర లేవంటూ ఎవరిని అడిగిన ఇదే సమాధానం చెబుతున్నారు. పార్ట్ బీ, టీఎం 33 కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వివరాలు కూడా అందించడం లేదు. గోప్యంగానే దరఖాస్తులను పరిశీలిస్తూ పరిష్కరిస్తున్నారు.
నిలిచిపోయిన రెవెన్యూ సేవలు...
ధరణి దరఖాస్తులు పరిష్కరించేందుకు అధికారులంతా జిల్లా కేంద్రానికి వెళుతుండడంతో మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ప్రధానమైన తాసీల్దార్లు, ఆర్ఐ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో సర్టిఫికెట్లు సేవలు కోసం వచ్చే దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆయా కేటగిరీలలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో వాటికి అవసరమైన సర్టిఫికెట్ల కోసం నిరుద్యోగులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వారం రోజులుగా అధికారులు లేకపోవడంతో దరఖాస్తుదారులు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అధికారులు లేకపోవడంతో మిగిలిన అధికారులు కూడా విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాలు గతవారం రోజులుగా బోసిపోతున్నాయి.
ఫౌతి చేసుకోవడం వీలు కావడం లేదు
శిరంశెట్టి వెంకటేశ్వర్లు-కుచిపూడి గ్రామం, కోదాడ
పాత రికార్డులలో పేరు ఉండి పట్టాదారు చనిపోతే వారి పేరు ధరణిలో నమోదులేనట్టయితే ఆ పట్టాదారు వారసులు ఆ భూమిని ఫౌతి చేసుకోవడం వీలుకావడం లేదు.అంతేకాకుండా ప్రభుత్వభూమి పట్టా కలిగి ఉన్న పట్టాదారులు ఆ భూమిని తనఖా, రిజిస్ట్రేషన్ చేయుటకు వీలు కావడం లేదు.అధికారులు స్పందించి ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు
కొలుగూరి రఘుపతి, మర్రిగూడ
మండలంలో ధరణి రిజిస్ట్రేషన్ తో ఖర్చులు విపరీతంగా వస్తున్నాయి. బై నెంబర్స్ తో రిజిస్ట్రేషన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధరణికి ముందు రిజిస్ట్రేషన్ అయినా భూమి వివరాలను ఇవ్వటానికి అధికారుల ఆసక్తి చూపటం లేదు. కొత్త వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కూడా పాత వారి పేరు మీదనే చూపిస్తున్న భూ సంబంధించిన వివరాలు.
నెలలతరబడి తిరుగుతున్నా -రైతు సైదులు చింతపల్లి,మిర్యాలగూడ
నాకు 20గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ హూమిని నా కొడుకు పేరుమీద మార్చేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా నా భూమి సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలిసింది. అసైన్డ్ భూమిగా నమోదయి ఉంది. నిషేదిత జాబితా నుండి నా భూమిని తొలగించాలని నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్‌కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదు.