Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద
నవతెలంగాణ-భువనగిరి
సమాజానికి మూలస్తంభాల్లో ఒకటైన పత్రికా మీడియా జర్నలిస్టుల పై దాడులు చేయడం హేయమైన చర్యని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద అన్నారు. శనివారం భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీసీపీ రాజేష్ చంద్రకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఈ మధ్య కాలంలో దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజ హితం కోరే జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు కొందరి అసమర్ధతను అద్దం పడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ భర్త తన అనుచరులతో నవ తెలంగాణ విలేకరి ఇంటిపై,కుటుంబ సభ్యులపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు. తక్షణమే ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పేరబోయిన నర్సింహులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.అధికార పార్టీకి చెందిన నేతలు విలేకరులపై దాడులకు పాల్పడటం వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలకడం జరుగుతున్నదని విమర్శించారు. మోత్కూరులో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తాని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్, సీనియర్ జర్నలిస్టులు ఎస్కే.ఉస్మాన్ షరీఫ్, కోడారి వెంకటేష్, ఎల్లంల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, నిమ్మల సురేష్ గౌడ్, ఎండీ ఇస్థియాక్ పూజ నర్సింహ, పాల రాజు పాల్గొన్నారు.
రామన్నపేట : మోత్కూర్ మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై వార్తా కథనం రాసాడని మోత్కూరు మండల నవతెలంగాణ విలేకరి యాదగిరిపై దాడి చేసిన వారిపై, తప్పుడు కేసు ఎత్తివేసి, అతని ఇంటిపై దాడికి ప్రేరేపించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ రామన్నపేట అధ్యక్షులు ఏటేల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ రామన్నపేట ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహసిల్దార్, సిఐ, ఎస్ఐ లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 1న మున్సిపల్ చైర్పర్సన్ భర్త వర్సెస్ కౌన్సిలర్స్ అనే వార్తా కథనం నవ తెలంగాణ పత్రికలో రావడంతో కక్షసాధింపు చర్యగా యాదగిరిపై, ఆయనఇంటిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతనిపై హత్యాయత్నానికి పాల్పడడం సరిది కాదన్నారు. జర్నలిస్టు యాదగిరికి, కుటుంబానికి న్యాయం చేకూర్చి, భద్రత కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ప్రెస్ క్లబ్ ఆఫ్ రామన్నపేట ఉపాధ్యక్షులు ఎండి తక్కియోద్దిన్, ప్రధాన కార్యదర్శి బూరుగు వెంకటేశం, సహాయ కార్యదర్శి శివరాత్రి రమేష్, కోశాధికారి బోయపల్లి యాదయ్య, కార్యవర్గ సభ్యులు భైరబోయిన రమేష్, కనతాల శశిధర్ రెడ్డి, ఎండి గౌస్, అప్పం చెన్నకేశవ, హర్షద్ బెగ్ ఉన్నారు.
గుండాల: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండల నవ తెలంగాణ జర్నలిస్టు అవిశెట్టి యాదగిరి పై దాడిచేసిన వ్యక్తులను, అందుకు కారకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన రిపోర్టర్ యాదగిరిని ఫోన్ లో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ చైర్మన్ భర్త మేఘారెడ్డి పై పొలిటికల్ వార్త రాశాడన్న కోపంతో అతని అనుచరులు యాదగిరి ఇంటి పై దాడి చేసి రిపోర్టర్ ను కొట్టడంతో పాటు భార్య, తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఖండించారు.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.