Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దేవరపెట్టె రాకతో జాతర షురూ
- గుట్ట పైకి మకరతోరణం తరలింపు
- ముస్తాబైన పెద్దగట్టు
- అన్ని ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-సూర్యాపేట
యాదవుల ఆరాధ్యదైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచిన గొల్ల గట్టు లింగమంతుల జాతరకు సమయం రానే వచ్చింది.రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర నేటి ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదర్శనతో ప్రారంభం కానుంది.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో గల పెద్దగట్టుపై వెలిసిన లింగమంతుల స్వామి జాతర తెలంగాణలో రెండో అతిపెద్దజాతరగా గుర్తింపు పొందింది. జాతరకు శ్రీ లింగమంతుల స్వామి జాతర, యాదవగట్టు, గొల్లగట్టు, పెద్దగట్టు తదితర పేర్లతో పిలుస్తుంటారు.ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు.ఇందుకుగాను ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసింది.
గొల్లగట్టు జాతర...
యాదవ వంశానికి చెందిన ధ్రువ,ధరవర్ష మహారాజు ( 780 -793 ) తన పేరిట గ్రామాన్ని నిర్మించారని,ఆ రాజు నిర్మించిన గ్రామమే దురాజ్‌పల్లిగా పేరొందింది.యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి కొలువుండే గొల్లగట్టు పూర్వకాలంలో యాదవరాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహాస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయుడి దేవాలయాలు కట్టించారు.రెండేండ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టిపూజ మహోత్సవం జరుగుతుంది.మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టికుంభాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు.ఆదివారం ప్రారంభమైన ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.
కోరికలు తీర్చే లింగన్న...
కోరికలు తీర్చే దేవుడు శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది.ఈసారి సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గంపల ప్రదక్షణలతో జాతర ప్రారంభం కానున్నది.సంప్రదాయ ప్రకారం శనివారం మకరతోరణాన్ని పట్టణంలోని గొల్లబజార్‌లోని యాదవుల ఇంటి నుండి గట్టుపైకి తరలించి స్వామివారికి అలంకరించారు.
జాతరలో మొదటిరోజు.... గంపల ప్రదక్షిణ.
జాతరలో ఇది కీలక ఘట్టం.దిష్టిపూజ జరిగిన 15 రోజుల తర్వాత ఆదివారం జాతర ప్రారంభమవుతుంది.మాఘ పౌర్ణమి నాడు కేసారం గ్రామం నుండి చౌడమ్మతల్లి ఉన్న దేవర పెట్టాను తీసుకొని యాదవ రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి పెద్దగట్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఓ లింగ...ఓ లింగా అంటూ గజ్జల లాగులు, భేరి చప్పుళ్లు, కత్తులతో,కటారు లతో విన్యాసాలు చేస్తారు.మంద గంపలతో దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షణలు చేస్తారు.మెంతబోయిన, రెడ్డి, గొర్ల, మున్నా వారి సమక్షంలో రెండు బోనాలు చేసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాజులు, పూజారులు, గొల్ల కులస్తులు అవసరాలు (కత్తులను కడుపునకు అంటుకోవడం) పెడతారు.గొర్రెలను అవసరాలను పెట్టి పూజిస్తారు.బోనాల సమర్పణ ముందుగా మెంత బోయిన, మున్నా, రెడ్డి వంశీయులు బోనాలు చేస్తారు.అదేవిధంగా భక్తులు తమ వెంట తెచ్చిన జంతువులను బలి ఇవ్వడంతో లింగమంతుల స్వామి, చౌడమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీ. ప్రత్యేకమైన పూజా సామగ్రితో నిష్టతో వండుతారు.కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి తమలపాకులు కట్టి వండిన బోనాలను డప్పు చప్పుళ్లు, గజ్జెల లాగులతో విన్యాసాలు చేస్తూ సమర్పిస్తారు.
రెండో రోజు... చౌడమ్మ బోనాలు.
జాతరలో రెండవరోజు సోమవారం చౌడమ్మతల్లి బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మున్నా వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డి వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రె, మంతెనబోయిన వారు తెచ్చిన తొలి గొర్రెలను మొదటగా అమ్మవారి ముందు నిలబెట్టి అవసరాలు (కటార్లు అంటించడం) చేస్తారు.అనంతరం మున్నా వంశీయులు ఉపవాసముండి తెచ్చిన భద్దే పాల గొర్రెలు అమ్మవారికి బలి ఇస్తారు.అనంతరం గొర్రె ఆయాలు, సాయాలు( పేగులు, లివర్,కిడ్నీలు, నల్లడా, గుండె మాంసం) నెయ్యిలో వేసి వంట చేస్తారు.మున్నా వంశీయులు యజమానులుగా,మెంతబోయినవారు జాగిలాలుగా వ్యవహరించి మున్నవారు పట్టుకోగా మెంతబోయిన వారు బండపై వేసిన అన్నం నేరుగా నోటితో తింటారు.
మూడవరోజు చంద్ర పట్నం....
మూడోరోజు మంగళవారం మెంతబోయిన వారు తీసుకొచ్చిన పూజా సామగ్రితెల్ల పిండి, పచ్చపిండి, పసుపు కుంకుమలతో రాజులు, పూజారులు, బైకన్లు కథలు చెపుతారు. చెక్కపై పసుపు కుంకుమలు వేసి అందంగా పట్నం వేస్తారు. అనంతరం యాదవ వంశీయులు స్వామివారి కల్యాణం జరిపిస్తారు.దీంతో చంద్రపట్నం స్వామివారి కల్యాణం తంతు ముగుస్తుంది.సాయంత్రం వరకు మెంతబోయిన వారు కేసారం గ్రామం చేరుకుంటారు.
నాలుగో రోజు నెల వారం...
జాతరలో నాలుగో రోజు బుధవారం జరిగే కార్యక్రమం కేసారం గ్రామం నుండి పాలు తీసుకొచ్చి రెండుకొత్త బోనం కుండల్లో పాలు పొంగిస్తారు.అనంతరం మున్నా వారి గొర్రెను బలిస్తారు.ఈ సందర్భంగా బైకాన్లు భక్కులు కథలు చెప్పడం ద్వారా తంతు పూర్తి చేస్తారు.బలి ఇచ్చిన గొర్రెలకు సగం బైకాన్లు, మెంతబోయిన వారికి సగం ఇస్తారు.అనంతరం ఆయా వంశీయులకు ఆ మాంసాన్ని వండుకుని తినడం ఆనవాయితీ.ఇలా తినడం వల్ల వంశాభివద్ధి అవుతుందని వారి నమ్మకం.
ఐదో రోజు ముగింపు...
జాతరలో ఐదో రోజు గురువారం లింగమంతుల స్వామి దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.జాతర తంతు అంతా పూర్తయిన తర్వాత మొత్తం భక్తులు తుదిసారిగా మొక్కులు చెల్లించి ఇంటి ముఖం పడతారు.దీంతో జాతర ముగిసినట్లు ప్రకటిస్తారు.శంభు లింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల స్వామి భక్తులు తిరిగి తమ తమ స్వగ్రామాలకు పయనమవుతారు.అనాదిగా సంప్రదాయంగా, లింగమంతుల ఆచారంగా వస్తున్న గొల్లగట్టు జాతరలో మొక్కులు చెల్లించి రెండేండ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగమంతుల స్వామికి చెప్పి మరీ వెళ్తారు.ఐదు రోజులపాటు కొండకోనల్లో ఆటపాటలతో భేరీల చప్పుళ్ళతో, ఆ లింగమయ్య నామస్మరణలో భక్తులు ఆనందపారవశ్యంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.