Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ మాట్లాడాలంటే మిద్దెక్కాల్సిందే..
- పింఛన్ కోసం వేరే ఊరికి వెళ్లాల్సిందే..
- నేటికీ..ఆ ఊరికి బస్సు రాదు...
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు పూర్తి చేస్తారో..?
- ఔరా వానికి.. చుట్టూ ప్రజాప్రతినిధులే..
నవతెలంగాణ-నార్కట్‌పల్లి ఎండీ. సాదత్ అలి
ప్రపంచం అబ్బురపడే విధంగా జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న మన దేశం ఇంకా రవాణా వ్యవస్థ, ఇంటర్నెట్, వైద్యం ఆమడ దూరంలో ఉండి నేటికీ అంధకారంలో నెట్టుకొస్తున్న గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి కోవలోనే మండలానికి చివరి గ్రామం అయిన ఔరవానికి అన్ని అవస్థలే ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్లు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి చుట్టూ రాష్ట్రస్థాయిలో పేరు పొందిన ప్రజాప్రతినిదులు ఉన్నప్పటికీ అన్నీ సమస్యలతో నేటికీ ఔరావాణిలో అంధకారమే !
ఫోన్ మాట్లాడాలంటే మిద్దెక్కాల్సిందే..
ఇది ఏంటి.? ఫోన్ మాట్లాడాలంటే మిద్దెక్కాల్సింది అంటున్నారు. ఇక్కడ ఏమైనా రహస్యాలు మాట్లాడుకుంటారా..? అందరూ గోప్యంగా ఉంటారా.? అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.! భారతదేశం వెలిగిపోతుంది. జీ20 సదస్సుకు ఆతిథ్యవిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఊరికి నేటి వరకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఏ నెట్వర్క్ టవర్ లేకపోవడం గమనార్హం. అదే మరి ఫోన్ మాట్లాడాలంటే టవర్ కోసం సమయంతో సంబంధం లేకుండా ఎవరైనా మిద్దెక్కితేనే స్పష్టంగా వినబడుతుంది. పూర్తిస్థాయిలో మాట్లాడగలుగుతారు. అందుకే మరి ఫోన్ మాట్లాడాలి అంటే మిద్దె కావాల్సిందే.! నేడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో కొనసాగుతున్న తరుణంలో ఈ గ్రామానికి నెట్ సౌకర్యం లేకపోవడంతో కరోనా కష్ట కాలంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.
పింఛన్ కోసం వేరే ఊరికి వెళ్లాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివద్ధిలో పోటీపడుతున్నామని ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తీసుకోవడానికి గ్రామంలో నెట్వర్క్ రాకపోవడంతో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ప్రతినెల పింఛన్ పంచడానికి నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఆ గ్రామంలో సుమారు 280 మంది పింఛన్‌దారులు ఆ గ్రామానికి సమీపాన ఉన్న నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామానికి 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పెన్షన్‌కి వెళ్లి రోజు మొత్తం తమవంతు వచ్చేదాకా ఆ గ్రామంలో పెన్షన్ దారులు క్యూ లైన్లో నిలబడి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పించన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేటికీ..ఆ ఊరికి బస్సు రాదు...
ఆర్టీసీ రథచక్రం అభివద్ధికి దిక్సూచిక అని చెప్పుకునే ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన దుస్థితి. జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరవాణి గ్రామానికి నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడం దారుణం. ఆ గ్రామంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, మండల కేంద్రానికి రావాలన్నా సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం, అద్దెకు ఆటో మాట్లాడుకోవాల్సిందే. నల్లగొండ నుంచి బ్రాహ్మణ వెల్లంల వరకు సుమారు 20 ఆటోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు చేస్తున్నారు. ఆ ఊరిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఊరు నుంచి ఇతర గ్రామానికి వెళ్లే విద్యార్థులు రైతులు ఆర్టీసీ బస్సు లేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఉన్నత చదువుల కోసం ఊరును వదిలిపెట్టి తమకు కావలసిన బంధువులలో ఉండడం లేక హాస్టల్లో ఉండడం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు పూర్తి చేస్తారో..?
మండలానికి చివరికి గ్రామీణ గ్రామం అయినా ఔరవారిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అల్ప సంఖ్య వర్గం అత్యధికంగా ఉందని ఆలోచనతో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేసేందుకు ఎంపిక చేసి నిర్మాణం చేపట్టి కూడా ఐదు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పనులు కాలేదు. పనులు పూర్తయ్యేది ఎప్పుడు? పేదలకు పంచేది ఎప్పుడో? అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
ఔరావానికి.. చుట్టూ ప్రజాప్రతినిధులే..
ఔరవాణి గ్రామానికి చుట్టు రాష్ట్రస్థాయిలో పేరుపొందిన నాయకులు ఉండడం గర్వకారణం. ఔరవాణి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా పక్క గ్రామానికి చెందినవారే. అయినా ఈ గ్రామానికి నేటికీ రవాణా వ్యవస్థ ఇంటర్నెట్ వైద్యం అందుబాటులో లేదు.
పెన్షన్ పొందాలంటే పక్క గ్రామానికి వెళ్లాల్సిందే
సిలువేరు యాదయ్య (పెన్షన్ దారుడు)
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ తీసుకోవడానికి 100 రూపాయలు ఖర్చు చేసుకొని పక్క గ్రామమైన అప్పాజీపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆరోగ్యం సహకరించబడినప్పటికీ ప్రత్యేకంగా ఆటోను మాట్లాడుకొని పోవాల్సి వస్తుంది.